సొంత ఖర్చులతో నేడు సీఎం జగన్ అమెరికా పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తన సొంత ఖర్చులతో నేడు అమెరికా వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి.

మొదటిసారి ఆయన జెరూసెలం వెళ్లారు. ఇప్పుడు అమెరికా వెళ్తున్నారు. ఈ రెండు విదేశీ పర్యటనలకు కూడా ప్రభుత్వం డబ్బు కాకుండా తన సొంత డబ్బుతోనే వెళ్లడం పట్ల రాజకీయ వర్గాల్లోనే కాదు…. ప్రభుత్వ వర్గాల్లోను, ప్రజల్లోనూ కూడా హర్షం వ్యక్తం అవుతోంది.

గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మందిమాగదులతో కలిసి దాదాపు 25 మంది పెట్టుబడుల నెపంతో పలు విదేశాల్లో పర్యటించారు. ఈ పర్యటనల వల్ల పెట్టుబడులు రావడం మాట అటుంచి రాష్ట్ర్ర ఖజానాకు మాత్రం భారీగానే భారం పడింది.

ఒక పక్క రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందీ ఆదుకోండంటూ కేంద్రాన్ని కోరినట్లుగా నటిస్తూ మరోవైపు విదేశీ పర్యటనలకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు చంద్రబాబు నాయుడు. ఈ తీరుతోనే కేంద్రం చంద్రబాబు నాయుడి పట్ల తీవ్ర అసహన్ని వ్యక్తం చేసిందని, ఇందుకే కేంద్రం నుంచి అందాల్సిన సాయానికి కొర్రీలు పెట్టిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

విజయవాడలో స్వాతంత్ర్య వేడుకలు ముగిసిన తర్వాత గురువారం నాడు సీఎం వైఎస్ జగన్ అమెరికా పయనమవుతారు. వారం రోజుల పాటు అమెరికాలోని వివిధ రాష్ట్రాలలో అధికారిక పర్యటనల్లో పాల్గొంటారు. అమెరికాలో సీనియర్ అధికారులతోను, ప్రపంచ బ్యాంకు అధికారులతోనూ వివిధ అంశాలపై చర్చలు జరుపుతారు.

రాష్ట్ర్రంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న చర్యలు, భవిష్యత్ లో ప్రజాసంక్షేమం కోసం చేపట్టబోయే కార్యక్రమాలను అమెరికాలోని విద్యావేత్తలకు వివరించబోతున్నారు వైఎస్ జగన్. ఈ సమావేశం అత్యంత కీలకమైనదని, విద్యావేత్తల సలహాలు, సంప్రదింపులతో పలు సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఇక అమెరికాలోని వివిధ రాష్ట్రాలలో ఉన్న తెలుగు వారితో సమావేశమవబోతున్నారు జగన్. డల్లాస్ లో జరిగే ఈ కార్యక్రమానికి అమెరికాలో ఉన్న తెలుగు వారు భారీ ఏర్పాట్లు చేశారు. వివిధ రాష్ట్రాలలో ఉన్న తెలుగు వారంతా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఇప్పటికే ‘వెల్ కం సీఎం’ అంటూ అమెరికాలోని తెలుగు వారు చిన్నారులతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.