దొంగ-పోలీస్ పెళ్లి

పాము కి ముంగీస కి పెళ్లంటే నమ్మగలమా. అట్లాగే దొంగ కి పోలీసు కి పెళ్లంటే నమ్మబుద్ది అవుతుందా? మీరు నమ్మండి నమ్మక పోండి. ఇదయితే నిజం గా జరిగిన పెళ్లి. అదీ తెలియక పొరపాటున చేసుకున్న వివాహం కాదు. ప్రేమించుకుని మరీ చేసుకున్న పెళ్లి.

పరస్పర విరుద్ధమైన వృత్తుల్లో ఉన్నవారి మధ్య కూడా ప్రేమ పుడుతుందని వీరి పెండ్లి నిరూపించింది. ఎన్నో ప్రేమ కథలు విన్నాం. కానీ ఇంతవరకు సినిమాల్లో తప్ప నిజజీవితంలో ఇటువంటి స్టోరీ విని ఉండకపోవచ్చు. పోలీస్ లాకప్ లో పడ్డ ఒక నేరస్థుడి తో అతడికి కాపలా ఉన్న ఓ మహిళా పోలీస్ కి పెండ్లి అవటం నిజంగా విచిత్రం కదూ…!

రాహుల్ థస్రన ఒక గ్యాంగ్ స్టర్. అతడి వయసు 30 ఏళ్లు. ఇతడు మే 9, 2014 నాడు మన్మోహన్ గోయల్ అనే వ్యాపారిని మర్డర్ చేశాడు. ఆ నేరంపై అరెస్టు చేశారు పోలీసులు. ఇదే కాదు చాలా దోపిడీల తో, హత్యలతో ఇతడికి సంబంధం ఉందని ఆంగ్ల దినపత్రిక రిపోర్ట్ చేసింది. ఈ నేరస్థుడి తో లేడీ పోలీస్ పాయల్ ప్రేమలో పడింది.

వీరిద్దరూ మొదటిసారిగా చత్తీస్ గర్ రాష్ట్రంలోని స్వరాజ్ పూర్ జిల్లాలో కలుసుకున్నారు. రాహుల్ లాకప్ కి రావడం… పోవడం… మామూలయింది. ఇతడితో పరిచయం పెరిగింది. అతడు బయటికి వెళ్లినా కూడా టచ్ లో ఉంటూ వచ్చింది. ఈ పరిచయం ముదిరి వీరి మధ్య ప్రేమ చిగురించింది. తరువాత వివాహం చేసుకున్నారు.

అయితే వారు పెళ్లి చేసుకున్న విషయం మాత్రం ప్రపంచానికి అంతగా తెలియదు. వివాహ సందర్భంలో తీసిన ఫోటోలను రాహుల్ తన ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ప్రారంభించాడు. ఇట్లా ఉత్తరప్రదేశ్ లోని ధంకవుర్ పట్టణానికి చెందిన ఓ స్నేహితునికి షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

గమనించాల్సిన సంగతేంటంటే పాయల్ పనిచేస్తున్న గౌతమ బుద్ధ నగర్ పోలీస్ స్టేషన్ అధికారులెవరికీ ఈ పెండ్లి విషయం ఏమీ తెలియకపోవడం.

రూరల్ ఎస్పీ రాం విజయ్ సింగ్ మాట్లాడుతూ… ఆమె ఎక్కడ విధులు నిర్వహిస్తున్నదీ, ఎవరిని పెళ్లి చేసుకున్నదీ అనే సంగతులను పరిశీలిస్తున్నామని అన్నారు. వాస్తవాలు బయటపడితే ఆమె పై తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

కరుడు కట్టిన నేరస్థుడయిన రాహుల్… అనిల్ దుంజా గ్యాంగ్ లో పని చేస్తున్నాడు. 2008 నుంచి అతడు నేరాలు చేస్తూనే ఉన్నాడు.