10 కోట్లు ఇస్తే పల్లెలకు మీ పేర్లు పెడుతాం…

వరదలు కర్నాటకకు భారీ నష్టాన్నే మిగిల్చాయి. 23 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు కర్నాటక ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

వరద ప్రాంతాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు సహకరించాల్సిందిగా పారిశ్రామికవేత్తలకు కర్నాటక సీఎం యడ్యూరప్ప పిలుపునిచ్చారు. విధాన సౌధలో 60 కంపెనీల ముఖ్యలుతో సమావేశం ఏర్పాటు చేశారు.

వరద ప్రాంతాలను ఆదుకునేందుకు విరాళాలు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు. 10 కోట్లకు మించి విరాళం ఇచ్చిన సంస్థలు, వ్యక్తుల పేర్లను వారు కోరుకున్న గ్రామాలకు పెడుతామని సీఎం ప్రకటించారు. ఇప్పటివరకు 6.97 లక్షలమందిని 1160 పునరావాస కేంద్రాలకు తరలించామని వివరించారు. 56 వేలమందికి కొత్తగా ఇళ్ళు నిర్మించాల్సి ఉందని రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలు పూర్తిగా నాశనం అయ్యాయన్నారు. అందరూ చేతులు కలిపితేనే పూర్తిగా నష్టపోయినవారిని ఆదుకునేందుకు వీలుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు.

సమావేశానికి హాజరైన కంపెనీల్లో టీవీఎస్‌ సంస్థ కోటి రూపాయల విరాళం ప్రకటించింది. టయోటా సంస్థ రూ.2కోట్లు, క్రెడాయ్‌ రూ.3కోట్లు ప్రకటించింది. బ్రిటానియా సంస్థ తాము బాధితులకు ఆహార పదార్ధాలను సమకూరుస్తామని సీఎంకు హామీ ఇచ్చింది. పలు సంస్థలు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని ప్రకటించాయి.