నిజాయితీగా పనిచేయండి…. లీడర్లను చేస్తా

గ్రామ వాలంటీర్లు వచ్చారు కాబట్టి ఇక వేగంగా పథకాలు లబ్దిదారుల వద్దకు చేరుతాయన్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను విజయవాడలో ప్రారంభించిన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంగించారు.

అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాలు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రభుత్వ పథకాలను వాలంటీర్లు ప్రతి 50 ఇళ్లకు సక్రమంగా అందేలా చూడాలన్నారు. కులం,  మతం, పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలను అందించే బాధ్యత గ్రామవాలంటీర్లదేనని చెప్పారు.

అక్టోబర్‌ 15 నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామన్నారు. పించన్లను వాలంటీర్లే డోర్ డెలివరీ చేయాల్సి ఉంటుందన్నారు. లబ్దిదారులను గుర్తించడం, వారికి పథకాలను డోర్ డెలివరీ చేయడం గ్రామ వాలంటీర్ల బాధ్యత అన్నారు. ఉగాది నాటికి రాష్ట్రంలో ఇంటి స్థలం లేని వారు ఉండకూడదన్నారు. ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం ఇచ్చితీరుతామన్నారు.

డబ్బు కోసం వాలంటీర్లు పక్కదారి పట్టకూడదనే ఉద్దేశంతోనే గౌరవవేతనంగా ఐదు వేలు ఇస్తున్నట్టు జగన్ చెప్పారు. కాబట్టి వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయకూడదన్నారు. వాలంటీర్లు నిజాయితీగా పనిచేస్తే వారిని భవిష్యత్తులో నాయకులను చేస్తామన్నారు. ప్రజలకు నిజాయితీగా సేవ చేస్తే సహజంగానే లీడర్లుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్నారు.

ఒక్క పైసా తీసుకోకుండా, ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు నాయకుడిగా ఎందుకు ఎదగకూడదని జగన్ ప్రశ్నించారు. ఎలాంటి లంచాలు తీసుకోకుండా, వివక్ష చూపకుండా, నిజాయితీగా సేవ చేస్తే గ్రామవాలంటీర్లను చూసి ప్రజలు నమస్కారం పెట్టే రోజులు వస్తాయన్నారు. చిన్న వయసులోనే వాలంటీర్లుగా సేవ చేసేందుకు ముందుకొచ్చిన వారు స్వచ్చమైన మనసుతో పనిచేయాలని, ఎలాంటి తప్పులు చేయవద్దని అప్పుడు దేవుడి ఆశీస్సులు కూడా ఉంటాయన్నారు సీఎం .

ఏదైనా ఇబ్బంది ఎదురైతే ప్రజలు ఫిర్యాదు చేయడం కోసం 1902 నెంబర్‌తో కాల్‌ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని… అది సీఎం కార్యాలయం పరిధిలోనే పనిచేస్తుందన్నారు. తాను ఎంతో నమ్మకంతో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తున్నానని… దయచేసి గ్రామ వాలంటీర్లు తప్పు చేశారన్న ఫిర్యాదులు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి వాలంటీర్లకు విజ్ఞప్తి చేశారు.