12 మంది చిన్నారులను కాపాడిన సాహసబాలుడు

కర్నాటకలో ఒక చిన్నారి సాహసం 12 మంది చిన్నారులను కాపాడింది. తీవ్ర అస్వస్థతకు గురైన 12 మంది చిన్నారులను తీసుకెళ్తున్న అంబులెన్స్‌కు దారి చూపేందుకు బాలుడు వరదకు ఎదురెళ్లాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌ అవుతోంది. పిల్లాడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

కర్నాటక రాయచూర్‌లో చిన్నారులు అస్వస్థతకు గురైనట్టు సమాచారం రావడంతో అంబులెన్స్ వెళ్లింది. వారిని తీసుకుని తిరిగి వస్తున్న సమయంలో హిరెరాయనకంపి గ్రామం వద్ద వాగు పొంగింది. బ్రిడ్జ్‌ కనిపించకుండాపోయింది. దాంతో అంబులెన్స్ డ్రైవర్‌కు ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఈ సమయంలో 12 ఏళ్ల వెంకటేశ్ వారికి దేవుడిలా ఎదురొచ్చాడు.

తనకు దారి తెలుసంటూ వరద నీటిలో అంబులెన్స్‌కు ముందు పరుగెత్తాడు. ఆ బాలుడిని అనుసరిస్తూ అంబులెన్స్‌ గట్టు దాటింది. పిల్లాడు చూపిన తెగువను ఒడ్డున ఉన్న కొందరు సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.