ఇక రోజా తప్పుకున్నట్టేనా?

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి రోజాపై ఇలాంటి పుకార్లు వస్తూనే ఉన్నాయి. సూపర్ హిట్ షో జబర్దస్త్ నుంచి ఈమె తప్పుకోవడం ఖాయమంటూ కథనాలు వరుసగా వస్తూనే ఉన్నాయి.

ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చిన రోజా, ఆ వెంటనే తిరిగి సెట్స్ పైకి వచ్చేశారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఆమె టాటా చెబుతారని అంతా అనుకున్నారు. అయితే ఆమెకు మంత్రిపదవి దక్కలేదు. దీంతో రోజా మళ్లీ జబర్దస్త్ సెట్స్ లో ప్రత్యక్షమయ్యారు. దీంతో అంతా ఓకే అనుకున్నారు. తాజాగా ఈమెపై మరోసారి అవే తరహా వార్తలు వస్తున్నాయి.

జబర్దస్త్ కొత్త ఎపిసోడ్స్ లో రోజా లేరు. ఆమె స్థానంలో శేఖర్ మాస్టర్ ను తీసుకున్నారు. తాజాగా రిలీజైన ప్రోమోలో నాగబాబు పక్కన శేఖర్ మాస్టర్ కనిపించారు. దీంతో రోజాపై మరోసారి అనుమానాలు గుప్పుమన్నాయి. మంత్రివర్గ విస్తరణలో ఆమెకు చోటు దక్కనప్పటికీ, సీఎం జగన్ మాత్రం ఆమెకు ప్రాధాన్యం ఉన్న నామినేటెడ్ పదవినే కట్టబెట్టారు. ఏపీఐఐసీ చైర్మన్ గా రోజా ఎన్నికైన తర్వాత ఇక జబర్దస్త్ కు రారేమో అని చాలామంది భావించారు. అయితే ఛైర్మన్ గా కొనసాగుతూనే ఆమె షోకు జడ్జిగా వ్యవహరించారు.

సో.. అంతా సెట్ అయిందనుకున్న టైమ్ లో రోజా మరోసారి జబర్దస్త్ సెట్స్ నుంచి మాయం అయ్యారు. ఈసారి కారణం ఏమై ఉంటుందా… అనే అంశంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ఆమె ఓ విదేశీ పర్యటన కోసమే ఇలా గ్యాప్ తీసుకున్నారని, త్వరలోనే జబర్దస్త్ సెట్స్ పైకి వచ్చేస్తారని ఓ వర్గం చెబుతోంది. మరికొందరు మాత్రం ఈసారి ఆమె సెట్స్ పైకి రాకపోవచ్చంటూ కథనాలు వండివారుస్తున్నారు.