ప్రేమికులపై గ్రామ పెద్దల దాష్టీకం..

ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలియదు.. ఎక్కడ పుడుతుందో తెలియదు.. నవతరం ప్రేమ చాలా స్పీడుగా ఉంది. గ్రామంలో ఉన్న ఇద్దరూ కూడా ప్రేమించుకున్నారు. మనసులు పంచుకున్నారు. అయితే పెద్దలు అభ్యంతరం తెలుపడంతో పారిపోయారు. పెళ్లి చేసుకొని బతుకుదామని ఆశించారు. కానీ ఇక్కడే ట్విస్ట్ వచ్చింది.

అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం కేపీదొడ్డి గ్రామానికి చెందిన బాబు, వన్నూరమ్మ అనే ఇద్దరు దళిత యువతీ యువకులు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

అయితే బాబు మేజర్.. వన్నూరమ్మ మైనర్ బాలిక. వీరి ప్రేమ పెద్దలకు తెలిసి హెచ్చరించారు. దీంతో బాబు, వన్నూరమ్మ మూడు రోజుల క్రితం గ్రామం నుంచి పరారయ్యారు.

కుటుంబ సభ్యులు వీరి ఆచూకీ వెతికి మరీ గ్రామానికి తీసుకొచ్చారు. గ్రామంలో రచ్చబండ వద్ద వీరిపై పంచాయతీ పెట్టారు. గ్రామానికి చెందిన గ్రామ పెద్దలు లింగప్ప, బ్రహ్మానందరెడ్డి ఈ పంచాయతీ నిర్వహించారు. ప్రేమికులను విచారించగా.. తాము ఒకరిని విడిచి ఒకరం ఉండలేమని పెళ్లి చేయాలని విన్నవించారు.

అయితే వీరి తల్లిదండ్రులు మాత్రం వరుసకు అన్నా చెల్లెల్లు అవుతారని వీరి పెళ్లికి ఒప్పుకోమని తేల్చిచెప్పారు. ఈ విషయం తెలియగానే ఆగ్రహించిన గ్రామ పెద్ద లింగప్ప బాబును చితకబాదిన అనంతరం వన్నూరమ్మ చెంపలపై కొట్టి.. కాలితో ఆమె చాతిపై తన్ని అంతటితో ఆగకుండా విచక్షణ రహితంగా కర్రతో కొట్టాడు.

మైనర్ అయిన నీకు ప్రేమ పెళ్లి అవసరమా అని ఆడపిల్ల అని కూడా చూడకుండా దారుణంగా కొట్టాడు. అయితే అయినా వన్నూరమ్మ తాను బాబును పెళ్లి చేసుకుంటానని భీష్మించుకు కూర్చుంది. దీంతో పోలీసులకు అప్పగిస్తామని గ్రామ పెద్దలు యువతిని బెదిరించారు.

ఈ పంచాయతీని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. చివరకు సుమోటాగా పోలీసులు కేసు నమోదు చేసి గ్రామ పెద్దలను అరెస్ట్ చేశారు.