ఆంధ్రప్రదేశ్ లో నూతన ఎక్సైజ్ విధానం – ప్రభుత్వ ప్రకటన

ఆంధ్రప్రదేశ్ లో ఇక నుంచి మద్యం దుకాణాలు ప్రభుత్వ అజమాయిషీలో పనిచేస్తాయి. ఇక నుంచి ఎప్పుడు పడితే అప్పుడు మద్యం దుకాణాలు తెరచుకోవడం, అధిక ధరలకు మద్యం అమ్మకాలు సాగించడం వంటివి ఉండవు.

తన పాదయాత్రలోను, ఎన్నికల మ్యానిఫెస్టోలోను ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మద్యం పాలసీని ప్రకటించింది.

ఈ నూతన విధానం అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ జయంతి నుంచి ప్రారంభమవుతుంది. నూతన మద్యం పాలసీని అనుసరించి… ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు పడితే అప్పుడు మద్యం దుకాణాలు తెరిచి ఉంచేందుకు వీలు ఉండదు. పాలసీ అమలులోకి వచ్చిన తర్వాత ప్రతి రోజూ మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ మాత్రమే తెరిచి ఉంటాయి.

ఇక ముందు మద్యం దుకాణాలు అన్నీ ఆంధ్రప్రదేశ్ బ్రేవరేజ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో పని చేస్తాయి. రాష్ట్రంలో మద్యాన్ని దశల వారీగా నిషేదించనున్నారు. అందులో భాగంగా ముందుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 3500 మద్యం దుకాణాలను నిర్వహిస్తారు.

ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాలన్నీ సీసీ కెమెరాల నిఘాలో పనిచేస్తాయి. మద్యం పాలసీలో భాగంగా రాష్ట్రంలోని మండలాలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో ఎక్కడ మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలో ఏపీ బ్రేవరేజ్‌ కార్పొరేషన్‌ నిర్ణయిస్తుంది. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో షాపుల ఎంపిక కోసం ఆరుగురు సభ్యులతో ఓ కమిటీని నియమిస్తారు. ఆ కమిటీ అర్హతలను బట్టీ షాపులను కేటాయిస్తారు.

ఈ ఎంపిక కూడా పారదర్శకంగా, పార్టీలకు అతీతంగా కేటాయించాలని నిర్ణయించారు.

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో నలుగురు, పట్టణ ప్రాంతాలలో ఐదుగురు సిబ్బంది పని చేస్తారు. ఈ షాపుల సూపర్ వైజర్ లకు డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. వారికి 17,500 రూపాయల జీతం ఇస్తారు.

ఇక మద్యం దుకాణాలలో పనిచేసే సేల్స్ మెన్ ఇంటర్ అర్హతతో 15 వేల రూపాయల వేతనాన్ని ఇచ్చేలా మద్యం పాలసీని రూపొందించారు. ఈ ఉద్యోగాల నియామకం ఔట్ సోర్సింగ్ ద్వారానే భర్తీ చేయాలని నిర్ణయించారు. ఒకసారి మద్యం పాలసీ అమలులోకి వచ్చిన తర్వాత బెల్టు షాపుల నిర్వహణ పూర్తిగా నిర్మూలించినట్లేనని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.