చంద్రబాబు ఇంటికి వీఆర్‌వో నోటీసులు

కృష్ణమ్మ వరద కారణంగా కరకట్టను ఆనుకుని ఉన్న చంద్రబాబు నివాసం నీటిలో చిక్కుకుంది. వరద క్రమంగా పెరుగుతుండడంతో చంద్రబాబు నివాసాన్ని వరద నీరు చుట్టుముట్టింది. చంద్రబాబు నివాసంతో పాటు పలు అక్రమ భవనాలు ఇప్పటికే జలదిగ్బంధంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

అక్రమ నిర్మాణాల యజమానులకు నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు నివాసానికి కూడా ఉండవల్లి వీఆర్‌వో నోటీసులు ఇచ్చారు. భారీ వరద వస్తున్న నేపథ్యంలో ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా వీఆర్‌వో ప్రసాద్ నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు ప్రస్తుతం ఇంట్లో లేకపోవడంతో భద్రతా సిబ్బందికి నోటీసులు ఇచ్చారు.

తక్షణం ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా భద్రతా సిబ్బందిని ఆదేశించారు. వరద కారణంగా మనుషులు ఉండడం సురక్షితం కాదని నోటీసుల్లో వీఆర్‌వో హెచ్చరించారు.

అయితే నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన వీఆర్‌వోను చంద్రబాబు సిబ్బంది లోనికి అనుమతించలేదు. వరద చుట్టుముట్టినా సరే ఇల్లు ఖాళీ చేసేందుకు చంద్రబాబు సిబ్బంది అంగీకరించడం లేదు.