వీపులు పగలగొట్టించుకున్నాం…. “దేశం”లో అన్నీ అవమానాలే

“నేను తెలుగుదేశం పార్టీలో 35 సంవత్సరాలుగా పని చేస్తున్నాను. ఇక్కడ కార్యకర్తలకు ఏనాడూ సరైన గుర్తింపు లేదు. పార్టీలో సీనియర్ అయిన నన్ను ఎన్నో సార్లు అవమానించారు. అయినా వాటిని దిగమింగుకుని కన్నీరు కారుస్తూ పార్టీలో ఉన్నాను ” అని తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరిన సీనియర్ నాయకుడు గరికపాటి మోహన్ రావు అన్నారు.

ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన భారతీయ జనతాపార్టీ బహిరంగసభలో ఆ జాతీయ పార్టీ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో గరికపాటితో సహా పలు జిల్లాలకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా గరికపాటి మోహన్ రావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని, బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన సమయంలో వీపులు కూడా పగల గొట్టించుకున్నామని గరికపాటి ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మనుగడే ప్రశ్నార్ధకంగా మారిందని, తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎటు వైపు అడుగులు వేస్తోందో కూడా తెలియడం లేదని గరికపాటి మోహన్ రావు చెప్పారు. “తెలంగాణ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 13 స్థానాల్లో మాత్రమే పోటీ చేయడాన్ని తాను ప్రశ్నించానని, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి తన మాటలు నచ్చలేదని” గరికపాటి వాపోయారు.

“తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు విలువ లేకుండా పోయింది. 2004 నుంచి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన రజని, తెలంగాణ మహిళా అధ్యక్షురాలు శోభారాణిలకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్లు కూడా ఇవ్వలేదు. ఇదేమని అడిగితే అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి నుంచి కూడా సమాధానం లేదు” అని గరికిపాటి మండిపడ్డారు.

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి తామంతా పాటు పడతామని, పార్టీ తమ సేవలను వినియోగించుకోవాలని తెలంగాణ బీజేపీ నాయకులను గరికపాటి కోరారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలలో 100 శాతం ఫలితాలు సాధించి భారతీయ జనతా పార్టీ తన సత్తా చాటుకుంటుందని గరికపాటి తెలిపారు.

ఈ బహిరంగ సభలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తో పాటు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఇటీవల పార్టీలో చేరిన తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ లు కూడా పాల్గొన్నారు.