పూరి సినిమాలో శ్రీదేవి కూతురు

ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తో మంచి ఊపుమీదున్న పూరీ జగన్నాద్, తన నెక్ట్స్ సినిమాను హీరో విజయ్ దేవరకొండతో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు కూడా.

ఇప్పుడీ సినిమాను మరింత బిగ్ గా ప్లాన్ చేస్తున్నాడు పూరి జగన్నాధ్. కుదిరితే బాలీవుడ్ బ్యూటీ, శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నాడు.

బాలీవుడ్ హీరోయిన్లను తెలుగుతెరకు పరిచయం చేయడం పూరికి కొత్తేంకాదు. కంగనా రనౌత్, దిశాపటానీ, నేహాశర్మ లాంటి ఎంతోమంది బాలీవుడ్ భామల్ని టాలీవుడ్ కు పరిచయం చేశాడు. ఇప్పుడు ఇదే కోవలో జాన్విని కూడా తెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

మరోవైపు జాన్వికి కూడా తెలుగులో నటించాలనే కోరిక ఉంది. నిజానికి ఇది ఆమె కోరిక కాదు. జాన్విని తెలుగు సినిమాలో కూడా చూడాలని ఉందంటూ గతంలో శ్రీదేవి తన మనసులో కోరిక బయటపెట్టింది.

అందుకే అమ్మ కోరికను నెరవేర్చేందుకు జాన్వి, తెలుగులో నటించాలనుకుంటోంది. పైగా విజయ్ దేవరకొండ తన ఫేవరెట్ హీరో అంటూ గతంలో ప్రకటించింది ఈ ముద్దుగుమ్మ. సో.. ఈసారి పూరి జగన్నాధ్ కు పని ఈజీగానే అయిపోయే అవకాశాలున్నాయి.

ప్రస్తుతానికైతే స్క్రిప్ట్ కు తుదిమెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు పూరి జగన్నాధ్. త్వరలోనే పూరి-చార్మి కలిసి ముంబయి వెళ్లి జాన్విని ఒప్పించే పని మొదలుపెడతారు.

జాన్వి రంగంలోకి దిగితే మాత్రం అది భారీ బడ్జెట్ సినిమా అవుతుంది. ఇటు విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు కాబట్టి ఈసారి పూరి చేయబోయేది భారీ బడ్జెట్ సినిమానే అనుకోవాలి.