ఒలింపిక్ టెస్ట్ హాకీలో ఓటమిలేని భారత్

  • ఆస్ట్ర్రేలియాను 2-2తో నిలువరించిన భారత్

టోక్యో ఒలింపిక్స్ కు సన్నాహకంగా జపాన్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ హాకీ టెస్ట్ టోర్నీ రౌండ్ రాబిన్ లీగ్ లో 10వ ర్యాంకర్ భారత్ అజేయంగా నిలిచింది.

టోక్యో ఒలింపిక్స్ హాకీ స్టేడియం వేదికగా జరిగిన రౌండ్ రాబిన్ లీగ్ రెండోరౌండ్ పోటీలో రెండవర్యాంకర్ ఆస్ట్ర్రేలియాను 2-2 గోల్స్ తో భారత్ నిలువరించింది.

ఆస్ట్ర్రేలియా ఆధిపత్యంతో కొనసాగిన ఈ పోరు ఆట మొదటిభాగం 14వ నిముషంలోనే కైట్లిన్ నాబ్స్ గోల్ తో కంగారూ టీమ్ 1-0 ఆధిక్యం సంపాదించింది.

వందనా సూపర్ గోల్…

ఆ తర్వాత..ఆస్ట్ర్రేలియా జోరు పెంచి పెనాల్టీ కార్నర్ వెంట పెనాల్టీ కార్నర్ లు సాధించినా…భారత గోల్ కీపర్ సవిత అడ్డుకోడంతో ఆధిక్యాన్ని పెంచుకోలేకపోయింది.

ఆట 36వ నిముషంలో భారతజట్టు కలసికట్టుగా ఆడి ప్రత్యర్థిగోల్ పైకి దాడి చేసి ఈక్వలైజర్ సాధించింది. వందన కటారియా ఈ గోల్ సాధించడంతో స్కోరు 1-1తో సమమయ్యింది.

ఆట రెండు, మూడు క్వార్టర్లలో కంగారూ జోరుపెంచినా పటిష్టమైన డిఫెన్స్ తో భారత్ నిలువరించినా… ఆట 43వ నిముషంలో గ్రేస్ స్టెవర్ట్ గోల్ తో ఆస్ట్ర్రేలియా 2-1తో పైచేయి సాధించగలిగింది.

అయితే… భారతజట్టు మెరుపుదాడులు చేస్తూ స్కోరు సమం చేయటానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆట మరో ఐదు నిముషాలలో ముగుస్తుందనగా లభించిన పెనాల్టీకార్నర్ ను గుర్జీత్ కౌర్ గోల్ గా మలచడంతో భారత్ 2-2తో మ్యాచ్ ను డ్రాగా ముగించగలిగింది. దీంతో రెండుజట్లు చెరోపాయింట్ పంచుకోవాల్సి వచ్చింది.

ఆస్ట్ర్రేలియా లాంటి పవర్ ఫుల్ జట్టు తో మ్యాచ్ ను డ్రాగా ముగించడం కూడా భారత్ కు ఒక విధంగా విజయం లాంటిదే.
భారతజట్టు తన ఆఖరి రౌండ్ మ్యాచ్ లో 11వ ర్యాంకర్ చైనాతో తలపడనుంది. ప్రారంభమ్యాచ్ లో ఆతిథ్య జపాన్ ను 2-1 గోల్స్ తో భారత్ ఓడించిన సంగతి తెలిసిందే.