సాయం మీదే… పేరూ మీదే… – దాతలకు సీఎం జగన్ ఆఫర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు అమెరికాలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ ప్రవాసాంధ్రులతో పాటు ఏపీకి సాయం చేయాలనుకునే వారికి కొత్త ఆఫర్ ని ప్రకటించారు.

ఇంతకీ ఆ ఆఫర్ ఏమిటనుకుంటున్నారా..? ఇన్నాళ్లూ దాతలు ప్రభుత్వానికి వివిధ కార్యక్రమాల కోసం విరాళాలు ఇచ్చినా అది రెండు మూడు రోజులు మాత్రమే గుర్తుండిపోయేది. ఇప్పుడు ఆ పరిస్థితికి ఫుల్ స్టాప్ పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి.

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఆసుపత్రులకు కాని, బస్టాండులకు కాని, బస్ షెల్టర్లకు కాని, పాఠశాలలకు, అందులోని మౌలిక వసతులకు కాని, కళాశాలలకు కాని… ఇలా దేనికైనా దాతలు విరాళాలు ఇస్తే వాటికి ఆ దాతల పేరే పెడతామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.

అమెరికాలోని డల్లాస్ లో తెలుగు వారితో సమావేశమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నూతన విధానాన్ని ప్రకటించారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలంటూ ప్రవాసాంధ్రులను ఆహ్వానించిన ముఖ్యమంత్రి మరోవైపు దాతలు విరాళాల ఇచ్చి రాష్ట్ర్రం ప్రగతి పథంలో ముందుకు వెళ్లేందుకు సహకరించాలని కోరారు.

గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర్రానికి వివిధ రూపాలలో విరాళాలు ఇచ్చే వారికి ఇలాంటి ఆఫర్ ఇవ్వలేదని, ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి సరికొత్త ఆలోచన అని అంటున్నారు.

అమెరికాలోని డల్లాస్ లో జరిగిన ప్రవాసాంధ్రుల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ  ” ఏపీ ప్రభుత్వ వెబ్ సైట్ లో ఓ పోర్టల్ ను ఏర్పాటు చేస్తాం. సాయం చేయాలనుకున్న వారు అందులో తమ వివరాలను తెలియజేస్తే చాలు” అని అన్నారు.

దాదాపు పది వేల మంది హాజరైన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర్రంలో తమ విజయం వెనుక ఇక్కడున్న అమెరికన్ తెలుగు వారి పాత్ర ఎంతో ఉందని అన్నారు. ఖండాతరాలు దాటి వెళ్లినా తెలుగు రాష్ట్ర్రాలపైనా, తమ కుటుంబంపైనా చూపించిన ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు.

“నాకు, నా కుటుంబానికి మద్దతు తెలిపినందుకు మీకు నా సెల్యూట్” అని అన్నారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించడమే తన లక్ష్యమని, అందుకోసం అమెరికాలోని తెలుగు వారి సహాయ సహకారాలు కూడా కావాలని సీఎం కోరారు.

అమెరికాలో తన పట్ల చూపించిన ఆదరాభిమానాలకు తాను ఎంతో ఆనందపడుతున్నానని, రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలను ఆదరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

రాష్ట్ర్రంలో పోర్టులు, విమానాశ్రయాలూ ఉన్నాయని, పెట్టుబడులు పెట్టేందుకు అనువైన అంశాలున్నాయని చెప్పారు. మార్టిన్ లూథర్ కింగ్, మహాకవి శ్రీశ్రీ, మహాత్మా గాంధీ, డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ ల సూక్తులు, కవిత్వ ఫంక్తులను సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. ఆ సమయంలో సమావేశంలో పాల్గొన్న వారందరి నుంచి అభినందన సూచనగా చప్పట్లతో ప్రాంగణాన్ని హోరెత్తించారు.