ఆ రెండు వ‌ర్గాలే బీజేపీ టార్గెట్ !

తెలంగాణ‌లో పాగా కోసం బీజేపీ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇందుకోసం వ్యూహాలు ర‌చిస్తోంది. ఇప్ప‌టికే టీడీపీ నేత‌ల‌ను పార్టీలో చేర్చుకోవాల‌ని అనుకుంటోంది. జిల్లాల వారీగా నియోజ‌క‌వ‌ర్గ నేత‌ల‌కు కండువా క‌ప్పుతోంది.

టీడీపీ నేత‌ల‌ను ఒక వైపు చేర్చుకుంటూనే… మున్సిప‌ల్ ఎన్నిక‌ల నాటికి మెజార్టీ స్థానాల్లో అంతో ఇంతో ప్ర‌భావం చూపాల‌నేది బీజేపీ ఎత్తుగ‌డ‌గా తెలుస్తోంది. ఇందులో భాగంగా కొన్ని మున్సిపాల్టీల‌ను ఇప్పటికే పార్టీ హైక‌మాండ్ సెల‌క్ట్ చేసింది. రామ‌గుండం, క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌, గ్రేట‌ర్ హైద‌రాబాద్‌, నిజామాబాద్‌, బైంసా, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో కొన్ని మున్సిపాల్టీల్లో బీజేపీ ప్ర‌భావం ఉన్న‌ట్లు గుర్తించారు. ఇక్క‌డ మెజార్టీ సీట్లు గెల‌వాల‌నేది బీజేపీ నేత‌ల ప్లాన్‌.

మ‌రోవైపు టీఆర్ఎస్‌కు బీసీ ఓటు బ్యాంక్ ఉంది. కాంగ్రెస్‌కు ఎస్సీ,ఎస్టీ, రెడ్లతో పాటు ఇత‌ర వ‌ర్గాలు అండ‌గా ఉన్నాయి. దీంతో కాంగ్రెస్‌కు మూల‌స్తంభాలుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంక్‌ను ఆకర్షించే ప‌నిలో ప‌డింది బీజేపీ. అందుకోసం ఎస్సీల్లో కొంచెం ప్ర‌భావం చూపే, త‌మ పార్టీకి ద‌ళిత ఫేస్‌గా ఉప‌యోగ‌ప‌డ‌తార‌ని అనుకున్న వివేక్ తో పాటు ఇతర నేత‌ల‌ను ఆక‌ర్షించే ప‌ని చేప‌ట్టింది. వివేక్ ఇప్ప‌టికే బీజేపీలో చేరారు. మ‌రికొంద‌రు ద‌ళిత నేత‌ల‌ను పార్టీలోకి ఆహ్వానించే కార్య‌క్ర‌మం మొద‌లుపెట్టింది.

ఎస్టీ నేత‌ల్లో బ‌లరాం నాయ‌క్‌తో పాటు ఇతర నేత‌ల‌కు గాలం వేసే ప‌ని చేప‌ట్టారు. వారితో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. ఇందులో భాగంగా త్వ‌ర‌లోనే ఈ రెండు వ‌ర్గాల నేత‌ల‌తో భారీగా చేరిక‌లు ఉండేలా ప్లాన్ ర‌చిస్తున్న‌ట్లు తెలుస్తోంది.