వైద్య విద్య కౌన్సిలింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరగాల్సిన రెండో విడత ఎంబీబీఎస్, బీడీఎస్‌లో ప్రవేశాల కౌన్సిలింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిజర్వేషన్ల కోటా సీట్ల భర్తీపై దాఖలైన పిటిషన్ కొట్టేయడంతో ప్రవేశాలకు మార్గం సుగమమైంది.

ఇప్పటికే మొదటి విడత కౌన్సిలింగ్ పూర్తి చేశారు. అయితే ప్రవేశాల రిజర్వేషన్ల పై కొందరు కోర్టుకు వెళ్ళారు. దీంతో రెండో విడత కౌన్సిలింగ్‌పై అప్పట్లో స్టే ఇచ్చారు.

కాగా, తాజాగా ఇవాళ ఈ పిటిషన్‌పై న్యాయస్థానం మరో సారి విచారణ చేపట్టింది. దీనిపై కాళోజీ విశ్వవిద్యాలయం వాదనలు విన్న కోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కౌన్సిలింగ్ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని పిటిషనర్లకు కోర్టు తెలిపింది. 

దీంతో కాళోజీ విశ్వవిద్యాలయ అధికారులు మెడికల్ కౌన్సిలింగ్‌ను రీషెడ్యూల్ చేయనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.