నడ్డా కాదు…. అబద్ధాల అడ్డా – కేటీఆర్‌ కౌంటర్‌ అటాక్‌

తెలంగాణ…. కర్ణాటక రాష్టం కాదన్నారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డా నిన్న హైదరాబాద్‌ మీటింగ్‌ లో చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేటీఆర్‌.

జేపీ నడ్డా… ఆయన పేరు ఎప్పుడూ వినలేదని… ఆయన మాటలు విన్నాక ఆయన పేరు నడ్డా కాదు ‘పచ్చి అబద్దాల అడ్డా’ అని పేరు మార్చుకోవాలని సలహా ఇచ్చారు. కర్ణాటకలో చేసిన రాజకీయ నాటకాలు ఇక్కడ సాగవని హెచ్చరించారు. కుకట్ పల్లిలో జరిగిన టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.

ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ ను చదవడం కాదని… అవినీతి పై దమ్ముంటే ఆధారాలు బయట పెట్టాలని నడ్డాకు సవాల్‌ విసిరారు. జేపీ నడ్డా కాదు… పచ్చి అబద్ధాల అడ్డా అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు కేటీఆర్‌.

దేశంలో 70 ఏళ్ళలో…. 12 ఏళ్ళకు పైగా అధికారంలో ఉన్న బీజేపీకి, కాంగ్రెస్‌ కు హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉంటే నచ్చదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం వస్తే హైదరాబాద్‌ లో ఏదో జరిగిపోద్దని ప్రచారం చేశారని…. కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఉందని గుర్తు చేశారు. గతంలోలాగా కర్ఫ్యూలు పెట్టే సంస్కృతి పోయిందన్నారు.

రాష్ట్రం బాగుంటే కొందరకి నచ్చదని, మన పొలాలు పచ్చబడుతుంటే మరికొందరికి నచ్చదని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను ఉద్దేశించి కామెంట్స్‌ చేశారు కేటీఆర్‌. కేసీఆర్‌ ముందు చూపుతో ప్రాజెక్టులను నిర్మిస్తూ రైతులు సుభిక్షంగా ఉండాలని ముందుకెళ్తుంటే వాళ్ళకు నచ్చడంలేదన్నారు.

బీజేపీ నాయకులు కాళేశ్వరం మీద పడి ఏడుస్తున్నారని….. అసలు తెలంగాణ పోరాటమే నీళ్ళు-నిధులు-నియామకాల మీదని గుర్తుచేశారు కేటీఆర్‌. కేసీఆర్‌ ఇప్పుడు అదే పనిమీద ఉన్నారన్నారు.

మొన్నటి ఎన్నికల్లో బీజేపీ ఎన్నిస్థానాల్లో డిపాజిట్లు పోగొట్టుకుందో ముందు తెలుసుకోవాలని నడ్డాకు సలహా ఇచ్చారు. మోడీ, రాష్ట్ర అధ్యక్షుడు కాలుకు బలపం కట్టుకొని తిరిగి ప్రచారం చేసినా బీజేపీ ఒక్కస్థానానికే పరిమితమయిందని…. 103 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయారని గుర్తు చేశారు.

గత ఐదేళ్ళలో రావాల్సిన నిధులకంటే ఒక్క పైస అయినా హైదరాబాద్‌కు ఎక్కువగా ఇచ్చారా? ఒక్క పనైనా చేశారా? అని బీజేపీని ప్రశ్నించారు కేటీఆర్‌.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై బీజేపీ నాయకులు కామెంట్స్‌ చేస్తున్నారని….. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రెండు వేలు, మూడు వేలు పెన్షన్లు ఎందుకివ్వలేకపోతున్నారో బీజేపీ నేతలు చెప్పాలని కేటీఆర్ నిలదీశారు. పెన్షన్లకు మేం 12 వేల కోట్లు ఖర్చు చేస్తుంటే…. కేంద్రం ఇచ్చేది 200 కోట్లేనన్నారు. ఏ ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలోనైనా రైతులకు ఉచిత కరెంట్‌ ఇస్తున్నారో చూపించాలన్నారు.

రైతుబంధు పేరు మార్చి ‘పీఎం కిసాన్‌ యోజన’ అని పెట్టారని…. మిషన్‌ భగీరథ పేరు మార్చి ‘జల్‌ శక్తి అభియాన్‌’ అని పేరు మార్చి పెట్టారని…. ఇలా మా పథకాలన్నీ కాపీ కొట్టి మమ్మల్నే విమర్శిస్తున్నారని బీజేపీ నేతలను ఎద్దేవా చేశారు కేటీఆర్‌.

ఇప్పటికైనా బీజేపీ నేతలు చిల్లర ప్రచారం మానుకోని… మంచిపనులు చేసి మాతో పోటీ పడండి అని హితవు పలికారు.