తండ్రిని చంపి…. ముక్కలుగా నరికి…. డ్రమ్ములో కుక్కి….

కన్న తండ్రిని అతికిరాతకంగా చంపారు ఓ కొడుకు, కూతురు. తండ్రిని చంపడమే కాదు.. శవాన్ని ముక్కలుగా నరికారు. ఆ ముక్కలని ప్లాస్టిక్ డబ్బాల్లో దాచి ఇంట్లో ఓ మూల ఉంచారు.

ఈ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఆ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

ఈ సంచలన సంఘటన హైదరాబాద్ లోని మౌలాలిలో జరిగింది. మహారాష్ట్రకు చెందిన సుతార్ మారుతి (80) రైల్వే గూడ్స్ డ్రైవర్ గా పని చేసి పదవీ విరమణ పొందారు. గడిచిన 20 సంవత్సరాలుగా ఆయన మౌలాలి సమీపంలోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. సుతార్ మారుతి పెద్ద కుమారుడు చాలా కాలం క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పెద్ద కుమార్తె అనుపమ భర్తతో కలిసి మారేడుపల్లిలో నివాసం ఉంటోంది. ఆర్టీసీ కాలనీలో నివాసముంటున్న సుతార్ మారుతి భార్య గయా, రెండో కుమారుడు కిషన్, చిన్న కుమార్తె ప్రఫుల్ తో కలిసి ఉంటున్నారు.

తాగుడుకు బానిసైన సుతార్ మారుతి ప్రతినిత్యం తాగి వచ్చి ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. ఈ విషయంపై సుతార్ మారుతి ఇంట్లో ప్రతి రోజూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. గత కొంతకాలంగా కుమారుడు కిషన్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తనకు ఆరోగ్యం సరిగా లేకపోవడం, తండ్రి ప్రతి రోజూ తాగి వచ్చి గొడవ పడడం కుమారుడు కిషన్ కు ఆగ్రహం తెప్పించింది.

ఈనెల 16వ తేదీన 10 గంటలకు వృద్ధుడు సుతార్ మారుతి తాగి వచ్చి ఎప్పటి లాగానే ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. ప్రతి రోజూ తాగి రావడం, ఇంట్లో వారితో గొడవ పడడంతో అతని వేధింపులు భరించలేక కుటుంబ సభ్యులే చంపి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

కొడుకు కిషన్, కుమార్తె ప్రఫుల్ల ఈ హత్యకు పగడ్బందీగా వ్యూహం రూపొందించారని పోలీసులు చెబుతున్నారు. హత్య చేసిన అనంతరం శవాన్ని ముక్కలుగా కోయడం, ఆరు కొత్త ప్లాస్టిక్ డబ్బాలో ఆ ముక్కలను ఉంచడం పోలీసుల అనుమానాలకు ఊతమిస్తోంది.

సుతార్ మారుతి ఇంటికి వచ్చిన క్లూస్ టీం వివరాలు సేకరించింది. పోలీస్ డాగ్ కూడా ఇంటిలోనే అటూ ఇటూ తిరుగుతూ ఉండటం కూడా కుటుంబ సభ్యులపై అనుమానాలను రేకెత్తిస్తోంది.

సుతార్ మారుతి వేధింపుల కారణంగానే కుటుంబ సభ్యులు ఈ హత్య చేసి ఉంటారని, ఆ కోణంలోనే కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏసిపి సందీప్ తెలిపారు. ఈ హత్యకు పాల్పడ్డారని అనుమానిస్తున్న కుమారుడు కిషన్, కుమార్తె ప్రఫుల్ల పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.