బిగ్ బాస్ హౌస్ లో ఆత్మహత్యాయత్నం

సంచలనాలకు మారుపేరుగా మారిన బిగ్ బాస్ కార్యక్రమం మరో సంచలనాన్ని సృష్టించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓ నటి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటమే ఆ సంచలనం.

ఈ ఘటనతో బిగ్ బాస్ హౌస్ లో  పాల్గొన్న నటీనటులు, కార్యక్రమ వ్యాఖ్యాత కూడా కంగారు పడిపోయారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా..? దేశంలోని పలు భాషల్లో, పలు రాష్ట్రాల్లో జరుగుతున్న బిగ్ బాస్ కార్యక్రమాల్లో ఈ ఆత్మహత్య ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలని ఉందా…? కంగారు పడకండి. తెలుగు రాష్ట్రాలలో మాత్రం కాదు. ఈ ఘటన జరిగింది పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో. అక్కడ బిగ్ బాస్ హౌస్ – 3 కార్యక్రమంలో.

తమిళనాడులో నిర్వహిస్తున్న బిగ్ బాస్ – 3 కార్యక్రమం ఇక్కడి కంటే 30 రోజుల ముందే ప్రారంభమైంది. ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ ఈ బిగ్ బాస్ – 3 కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

తమిళనాడులో జరుగుతున్న బిగ్ బాస్ – 3 కార్యక్రమంలో తమిళ హాస్యనటి మధుమిత పాల్గొన్నారు. తమిళ చిత్రం ఒరు కల్ ఒరు కన్నాడి చిత్రంలో మధుమిత పోషించిన హాస్య పాత్ర ప్రేక్షకులను మెప్పించింది. దీంతో ఆమెకు బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం అవకాశం వచ్చింది.

బిగ్ బాస్ హౌస్ లో గడిచిన 50 రోజులుగా మధుమిత చలాకీగా ఉన్నారు. ఇటీవలే హౌస్ కెప్టెన్ గా నియమితులయ్యారు. బిగ్ బాస్ హౌస్ కు కెప్టెన్ గా మారిన తర్వాత  హౌస్ లో ఉన్న సహచరుల నుంచి తనకు సహకారం అందకపోగా వారి నుంచి ఎదురైన అవమానాలు తట్టుకోలేక పోయానని, అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని మధుమిత చెప్పారు.

ఈ ఘటనతో మధుమిత ను బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించేశారు నిర్వాహకులు. వ్యాఖ్యాతగా ఉన్న కమలహాసన్ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్లే మధుమిత మనస్తాపం చెందారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలను బిగ్ బాస్ కార్యక్రమ నిర్వాహకులు, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మధుమిత ఖండించారు.