ప్రో-కబడ్డీ లీగ్ లో తెలుగు టైటాన్స్ రెండో గెలుపు

  • హర్యానా స్టీలర్స్ పై 40-29తో విజయం

ప్రో-కబడ్డీలీగ్ 7వ సీజన్ చెన్నై అంచె పోటీలలో తెలుగు టైటాన్స్ తొలివిజయం సాధించింది.

జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ పోటీల 8వ రౌండ్ మ్యాచ్ లో హర్యానా స్టీలర్స్ ను భారీ తేడాతో చిత్తు చేసి…ప్రస్తుత సీజన్లో రెండో విజయాన్ని సొంతం చేసుకోగలిగింది.

ఆట మొదటి భాగం ముగిసే సమయానికే 21-13 పాయింట్లతో నిలిచిన తెలుగు టైటాన్స్ రెండోభాగంలోనూ అదేజోరు కొనసాగించింది. స్టార్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ స్థాయికి తగ్గట్టుగా ఆడి తనజట్టుకు అత్యధిక పాయింట్లు సాధించి పెట్టాడు.

చివరకు తెలుగు టైటాన్స్ 20 పాయింట్ల తేడాతో హర్యానా స్టీలర్స్ ను చిత్తు చేయగలిగింది. ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకూ ఎనిమిదిరౌండ్ల మ్యాచ్ లు ఆడిన తెలుగు టైటాన్స్ కు ఇది కేవలం రెండో గెలుపు మాత్రమే. ఓ మ్యాచ్ ను టైగా ముగించిన టైటాన్స్ ఐదుమ్యాచ్ ల్లో పరాజయాలు చవిచూసింది.

మొత్తం 12 జట్ల లీగ్ టేబుల్ మొదటి 8 రౌండ్లు ముగిసే నాటికి తెలుగు టైటాన్స్ 13 పాయింట్లతో 11వ స్థానంలో కొనసాగుతోంది. జైపూర్ పింక్ పాంథర్స్, ఢిల్లీ దబాంగ్, బెంగాల్ వారియర్స్ జట్లు మొదటి మూడుస్థానాలలో నిలిచాయి.