అబ్బాయిలతో స్నేహం వద్దన్న తండ్రి…. చంపేసిన కూతురు

పిల్లల్లో నేర ప్రవృత్తి పెరుగుతోంది. పెద్దలు మందలించినా, హితబోధ చేసినా సహించలేకపోతున్నారు. ఇందుకు పెద్దలను ఎదిరించేందుకు వెనుకాడడం లేదు. బెంగళూరులో ఒక అమ్మాయి ఏకంగా తనకు సూచనలు చేసిన తండ్రినే చంపేసింది. ఆమె ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది.

రాజాజీనగర్‌లో ఒక వ్యాపారి తన భార్య, కుమార్తె, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న తన కుమార్తె, … ప్రవీణ్ అనే అబ్బాయితో ఫోన్లో మాట్లాడుతుండడాన్ని గమనించి మందలించాడు. అబ్బాయిలతో స్నేహం మంచిది కాదని… బుద్దిగా చదువుకోవాలని హెచ్చరించాడు.

దాంతో అమ్మాయికి కోపం వచ్చింది. తన బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడకుండా అడ్డుపడుతున్నారన్న కోపంతో తండ్రిని హత్య చేసేందుకు ప్రియుడు ప్రవీణ్‌తో కలిసి ప్లాన్ చేసింది.

వ్యాపారి తన భార్య, కుమారుడిని వేరే ఊరు వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌లో వదిలిపెట్టి వచ్చాడు. తల్లి, సోదరుడు లేకపోవడంతో తండ్రిని చంపేందుకు ఇదే అదును అని భావించింది. తొలుత పాలలో నిద్రమాత్రలు కలిపి తండ్రికి ఇచ్చింది. అవి తాగి అతడు మత్తులోకి జారుకున్నాడు. వెంటనే ప్రియుడు ప్రవీణ్‌కు ఫోన్‌ చేసి రప్పించింది. అమ్మాయి, ప్రియుడు ఇద్దరు కలిసి కత్తితో అతడి గొంతు కోసేశారు. అనంతరం బాత్‌రూములో శవాన్ని వేశారు. బెడ్‌రూంలో నెత్తుటి మరకలను తుడిచేశారు. రెండు లీటర్ల పెట్రోల్ తెచ్చి బాత్‌రూంలో మృతదేహంపై పోసి అంటించారు. ఆ ప్రయత్నంలో వీరిద్దరిపైనా పెట్రోల్ పడి గాయాలయ్యాయి.

తండ్రి శవానికి నిప్పు పెట్టిన తర్వాత బాలిక మేడ మీదకు ఎక్కి కేకలు వేసింది. తన తండ్రి మంటల్లో చిక్కుకున్నారని రక్షించాలంటూ కేకలు వేసింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. తాను బంధువుల ఇంటికి వెళ్లి వచ్చే సరికి తన తండ్రి మంటల్లో ఉన్నారని తొలుత కథనాలు చెప్పింది బాలిక. కానీ శవంపై కత్తిపోట్లు ఉండడం, బాలిక, ఆమె ప్రియుడికి కూడా మంటలు అంటుకుని ఉండడం గమనించిన పోలీసులు గట్టిగా నిలదీయడంతో అసలు విషయం చెప్పేసింది.