బీజేపీ ప్రచారంపై అంబటి రాంబాబు ఫైర్

అమెరికా పర్యటనలో జరిగిన ఒక కార్యక్రమంలో జగన్ జ్యోతిప్రజ్వలనకు అంగీకరించలేదని.. ఆయన హిందూ వ్యతిరేకి అంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు.

జగన్‌పై విమర్శలు చేస్తూ బీజేపీ అధికార ఫేస్‌బుక్ ఖాతాలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారని… దున్నపోతు ఈనింది అనగానే దూడను కట్టేయండి అన్నట్టుగా బీజేపీ, సీఎం రమేష్, మాజీ మంత్రి మాణిక్యాల రావు తీరు ఉందన్నారు.

వాస్తవాలు తెలుసుకోకుండా ముఖ్యమంత్రిపై ఎలా విమర్శలు చేస్తారని ప్రశ్నించారు. అమెరికాలో కార్యక్రమం జరిగిన హాల్‌లో ఫైర్ వాడడానికి నిబంధనలు అంగీకరించవన్నారు. అందుకే విద్యుత్‌ దీపాన్ని వెలిగించి జగన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు.

ఆ విషయం తెలుసుకోకుండా బీజేపీలో చేరిన పచ్చ పార్టీ ఎంపీ సీఎం రమేష్ విమర్శలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. జగన్‌ను హిందూ వ్యతిరేకి అంటున్న మాజీ మంత్రి మాణిక్యాలరావు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే విజయవాడలో 40 దేవాలయాలను నేలమట్టం చేస్తుంటే ఏం చేశారని ప్రశ్నించారు. వీళ్లా హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తులు అని ప్రశ్నించారు. సదావర్తి భూములను చంద్రబాబు మింగేస్తుంటే దేవాదాయశాఖ మంత్రిగా గుడ్లగూబలా చూస్తూ ఊరుకున్న మాణిక్యాలరావు లాంటి వారు జగన్‌ను విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు.