పంపితే పరువు పోతుంది… ఉంచేస్తే అప్రతిష్ట

ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు వ్యవహారం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు… ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

కోడెల శివప్రసాదరావు తన సొంత నియోజకవర్గం నరసరావుపేటలో ఆయన కుమారుడు, కుమార్తె చేసిన అవినీతి, అక్రమాలపై ఆరోపణలు వెల్లువెత్తాయి.

తాజాగా శాసనసభకు చెందిన ఫర్నీచర్, కంప్యూటర్లను కూడా కోడెల శివప్రసాద్ తన ఇంటికి తరలించిన వైనం సంచలనంగా మారింది. ఈ విషయంపై మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా “శాసనసభ ఫర్నీచర్ ను భద్రత కోసం మా ఇంటికి తరలించాను” అని అంగీకరించారు.

ఇది ఇప్పుడు అధికార పార్టీ వారినే కాదు… తెలుగు ప్రజలలో కూడా ఆశ్యర్యానికి గురిచేసింది. ఏ నోటా విన్నా…. “మరీ ఇంత దారుణమా? శాసనసభ అధిపతి అయిన స్పీకరే ఇలా వ్యవహరిస్తారా..?” అని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.

రోజుకో కొత్త చిక్కు తీసుకువస్తున్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ వ్యవహారంపై ఏం చేయాలో తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అర్ధం కావడం లేదంటున్నారు. అవినీతి, అక్రమాలకు పాల్సడిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై ఎలాంటి నిర్ణయం తీసుకున్నాఅది పార్టీకి నష్టం చేస్తుందనే అంటున్నారు.

తప్పులు చేసి దారుణంగా దొరికిపోయిన కోడెల శివప్రసాద్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆయన చేసిన నేరాలను పార్టీ అంగీకరించినట్లేనని, అదే జరిగితే ఇప్పటికే తెలుగు ప్రజల్లో చులకనై పోయిన పార్టీ మరింత బజారున పడుతుందని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీనియర్ల వద్ద అన్నట్లు సమాచారం.

పోనీ అని పార్టీలో కొనసాగిస్తే ఇంకా ఏ రోజు ఏ అవినీతి, అక్రమ వ్యవహారం బయటపడి… పార్టీ పరువు పోయి అప్రతిష్ట మూటకట్టుకోవాల్సి వస్తుందేమోననే భయం మాజీ సీఎం చంద్రబాబు నాయుడ్ని వేధిస్తోందంటున్నారు.

కోడెల శివప్రసాద్ పట్ల తనకు ముందు నుంచి కూడా సరైన అభిప్రాయం లేదని, అయినా ఓ “పెద్దాయన మాటకు తలవొగ్గి స్పీకర్ పదవి ఇచ్చాను. అదే ఇప్పుడు పార్టీని నీడలా వెంటాడుతోంది” అని చంద్రబాబునాయుడు నర్మగర్భంగా ఒక పత్రికాధిపతి గురించి పార్టీ సీనియర్ల ముందు వాపోయినట్లు చెబుతున్నారు.

మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ వ్యవహారంతో ప్రజల్లో పార్టీ చులకనైపోయిందనే అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. అయితే దీని పై నష్ట నివారణ చర్యలు మాత్రం ఎలా తీసుకోవాలో ఆయనకు అర్ధం కావడం లేదని సీనియర్ నాయకులు అంటున్నారు.