చిదంబరానికి సుప్రీంలో లభించని ఊరట

మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి సుప్రీం కోర్టులో కూడా ఊరట లభించలేదు. ఐఎన్‌ఎక్స్ కేసులో చిదంబరంను అరెస్ట్ చేసేందుకు సీబీఐ గాలిస్తుండగా ఆయన మాత్రం పరారీలో ఉన్నారు. అదే సమయంలో ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.

ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్‌ను నిరాకరించిన వెంటనే మంగళవారమే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌ను కలిసేందుకు చిదంబరం, కాంగ్రెస్ సీనియర్ నేత, లాయర్ అయిన కపిల్ సిబల్ ప్రయత్నించారు. కానీ తన చాంబర్‌లోకి వీరిని సీజే అనుమతించలేదు. దాంతో బుధవారం ఉదయమే పిటిషన్‌ విచారణకు వచ్చేలా వ్యూహరచన చేసి బెయిల్‌ పిటిషన్ దాఖలు చేశారు.

ఉదయం సీజే అయోధ్య కేసు విచారణలో ఉంటారు కాబట్టి… జస్టిస్ ఎన్‌వీ రమణ ముందుకు చిదంబరం పిటిషన్ వస్తుందని నిన్ననే కపిల్ సిబల్ చెప్పారు. అన్నట్టుగానే ఎన్‌వీ రమణ బెంచ్ ముందుకు పిటిషన్ వచ్చింది.

అయితే ఈ కేసు మనీలాండరింగ్‌కు సంబంధించినది కావడంతో పిటిషన్‌ను చీఫ్ జస్టిస్‌కు ఎన్‌వీ రమణ పంపించారు. దీనిపై సీజేనే ఆర్డర్ పాస్ చేయాలని ఎన్‌వీ రమణ కోరారు.

దీంతో ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ ఎప్పుడు విచారిస్తారు… ఎలాంటి ఆదేశాలు ఇస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. చిదంబరం కోసం ఢిల్లీతో పాటు చెన్నైలోనూ సీబీఐ గాలిస్తోంది. ఆయన తమిళనాడులోనే అజ్ఞాతంలో ఉన్నట్టు భావిస్తున్నారు.