టీడీపీ సీనియర్ నేత హఠాన్మరణం

తెలుగుదేశం పార్టీకి ఇదో విషాదకర వార్త. ఆ పార్టీ సీనియర్ నేత , మాజీ మంత్రి హఠాన్మరణం చెందారు. ఆయన మృతికి టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు మాజీ మంత్రులు, నేతలు దిగ్ర్భాంతి చెందారు. అయితే చంద్రబాబు వల్లే సీనియర్ నేతకు ఈ దుర్ఘతి పట్టిందని ఆయన సన్నిహితులు ఆరోపిస్తుండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య బుధవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురయ్యారు. బాధతో విలవిలలాడుతున్న ఆయనను హుటాహుటిన కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు.

బ్రహ్మయ్య కొంతకాలంగా రాజకీయంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి రాజంపేట అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు. కానీ చంద్రబాబు బ్రహ్మయ్యకు టికెట్ ను నిరాకరించారు. ఈ దెబ్బకు గత ఫిబ్రవరిలోనే ఆయనకు గుండెపోటు వచ్చింది. విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు.

కాగా ఈ మనస్థాపంతోనే ఆయన మంచాన పడ్డారు. అప్పటి నుంచి కోలుకోలేదు. తాజాగా వచ్చిన గుండెపోటుతో మరణించారు. చంద్రబాబు టికెట్ నిరాకరించడమే బ్రహ్మయ్య మరణానికి కారణమని ఆయన అనుయాయులు ఆరోపిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.