ఆక్టోపస్‌ పోలీసుల ఆరాచకం

హైదరాబాద్‌ ఆక్టోపస్ పోలీసులు రెచ్చిపోయారు. ఫుల్‌గా మద్యం సేవించి ఒక యువకుడిపై మూకుమ్మడిగా దాడి చేశారు. భోజనం చేసేందుకు హోటల్‌కు వచ్చిన రాము అనే యువకుడిపై దాడి చేశారు. 15 మంది ఆక్టోపస్‌ పోలీసులు హోటల్‌లో స్వైరవిహారం చేశారు. వీధి రౌడీల తరహాలో వ్యవహరించారు. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

ఒక్కడిని అంత మంది కొడుతుండడంతో అడ్డుకునేందుకు వచ్చిన ఇతర కస్టమర్లు, హోటల్ యాజమాన్యంపైనా దాడి చేసి కొట్టారు. తాము పోలీసులమని… తమకే అడ్డు చెబుతారా…. అంటూ అడ్డు వచ్చిన వారిని కొట్టారు.

ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దాడి చేసిన 15 మందిపై బాధితుడు రాము ఫిర్యాదు చేసినా చర్యలు లేవు. 15 మంది పోలీసులు కావడంతో రాజీకి రావాల్సిందిగా అతడిపై ఒత్తిడి తెస్తున్నారు. ఇంతలో దాడికి సంబంధించిన దృశ్యాలు మీడియాలో వచ్చాయి.

ఇప్పుడు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దానిపై చర్చ జరుగుతోంది. ఒక్కడిని చేసి 15 మంది పోలీసులు కండకావరం ప్రదర్శించడంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

మందు కొట్టి ఇలా రౌడీల్లా వ్యవహరించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోని అధికారులు… దాడి దృశ్యాలు బయటకు వచ్చిన నేపథ్యంలో దాడి చేసిన పోలీస్ ముఠాపై చర్యలు తీసుకుంటారా లేదా అన్నది చూడాలి.