ఆమె అస్త్రం… ఆమెకే తగిలింది…

ఇదో సంచలనం. మహిళలను రక్షించేందుకు కేంద్రం తీసుకువచ్చిన ఓ చట్టాన్ని అడ్డం పెట్టుకుని మాజీ భర్తను ఇరుకున పెట్టాలనుకున్న ఓ భార్యకు కోర్టు ఇచ్చిన షాక్ ట్రీట్ మెంట్…. చట్టాన్ని చుట్టంగా మార్చుకుని భర్తకు చుక్కలు చూపించాలనుకున్న ఓ మహిళలకు కోర్టే చుక్కలు చూపించిన అరుదైన సంఘటన. చట్టాన్ని దుర్వినియోగం చేయాలనుకున్న మహిళకు చెన్నై హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుతో కనువిప్పు కలగడమే కాదు… తప్పుడు కేసులు పెట్టాలనుకునే వారికి ఓ పాఠం చెప్పింది. ఇంతకీ విషయం ఏమిటనుకుంటున్నారా…

చెన్నైలో నివాసం ఉంటున్న ఓ మహిళ తన భర్త నుంచి విడిపోయింది. వారికి 11 సంవత్సరాల కుమార్తె ఉంది. భర్తను ఇబ్బందుల పాలు చేయాలనుకున్న ఆ మహిళ తన కుమార్తెను అడ్డం పెట్టుకోవాలనుకుంది. కుమార్తెపై కన్నతండ్రే అఘాయిత్యానికి పాల్పడ్డారంటూ పోక్స్ కేసు పెట్టింది. ఈ కేసు పెట్టిన మరుక్షణం పోలీసులు ఆమె భర్తను అరెస్టు చేసి జైలుకి కూడా పంపారు.

అయితే ఇది తప్పుడు కేసని, తన నుంచి విడిపోయిన భార్య తనను ఇరుకున పెట్టేందుకే ఈ కేసు నమోదు చేసిందని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు భర్త. ఈ కేసు మంగళవారం నాడు మద్రాస్ హైకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చింది.

విచారణ ప్రారంభించిన న్యాయమూర్తులకు షాక్ తగిలే అంశం తెలిసింది. ఇదే బాలిక ఎగ్మూర్ ఫ్యామిలీ కోర్టులో వెల్లడించిన అంశాన్ని న్యాయమూర్తి ఈ సందర్భంగా వెల్లడించారు.

ఇంతకీ ఆ విషయం ఏమిటంటే…. తనపై తండ్రి అఘాయిత్యం చేయలేదని, తన తల్లే అలా చెప్పించిందని ఆ బాలిక వెల్లడించింది. దీంతో ఆ భార్య కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ కేసు పెట్టిందని తేలింది. తండ్రే అఘాయిత్యానికి పాల్పడ్డారంటూ వ్యాజ్యం రావడం దురదృష్టమంటూ హైకోర్టు బెంచీ వ్యాఖ్యానించింది.

కోర్టు బాలికను పిలిచి విచారించినప్పుడు ఆ చిన్నారి చెప్పిన సంగతులు విని తన మనసు కలచి వేసిందని న్యాయమూర్తి అన్నారు. కన్నకూతురి భవిష్యత్ ను చూడకుండా…. ఇలాంటి కేసులు పెట్టాలని ఆ భార్యకు మనసు ఎలా వొప్పిందని వ్యాఖ్యానించారు న్యాయమూర్తి.

ఈ కేసులో పెట్టిన పోక్స్ చట్టాన్ని తక్షణమే రద్దు చేయడంతో పాటు తప్పుడు కేసు పెట్టిన భార్యపైనే కేసు పెట్టాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. పైగా ఆమెపై పోక్స్ చట్టాన్నేపెట్టాలని పోలీసులను ఆదేశించారు న్యాయమూర్తి.