అయ్యో బంగార్రాజు.. మళ్లీ అడ్డంకి

సెట్స్ పైకి తీసుకొద్దామనుకున్న ప్రతిసారి ఈ సినిమాకు ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఇక అంతా ఓకే అయిపోయిందనుకున్న టైమ్ లో దర్శకుడు కల్యాణ్ కృష్ణ సోదరుడు హఠాత్తుగా కన్నుమూశాడు. దీంతో సినిమా మళ్లీ ఆగిపోయింది. కల్యాణ్ కృష్ణ తేరుకోవడానికి చాలా టైమ్ పడుతుందని నాగార్జున కూడా ఆ ప్రాజెక్టును పక్కనపెట్టాడు. కట్ చేస్తే, ఇప్పుడు కల్యాణ్ కృష్ణ రెడీ అయిపోయాడు. కానీ ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది.

కల్యాణ్ కృష్ణ తేరుకోవడానికి ఇంకాస్త టైమ్ పడుతుందనే ఉద్దేశంతో నాగచైతన్య మరో సినిమాకు కాల్షీట్లు కేటాయించాడు. ప్రస్తుతం చేస్తున్న వెంకీ మామ కంప్లీట్ అవ్వగానే, శేఖర్ కమ్ములతో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అంతలోనే కల్యాణ్ కృష్ణ రెడీ అన్నాడు. దీంతో నాగార్జున ఓకే చెప్పినా, నాగచైతన్య అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది.

మొత్తమ్మీద అంతా కలిసి మధ్యేమార్గంగా ఓ పరిష్కారం ఆలోచించినట్టు తెలుస్తోంది. ఎలాగూ నాగార్జున ఖాళీగా ఉన్నాడు కాబట్టి, సినిమా ప్రారంభించి అతడితో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నారు. తర్వాత మెల్లగా కాల్షీట్లు సర్దుబాటు చేసి నాగచైతన్యను ఇటువైపు లాగాలనేది ప్లాన్. ఎటొచ్చి నాగచైతన్య మాత్రం ఫస్ట్ షెడ్యూల్ నుంచి ఉండాల్సిందే. ఎఁదుకంటే, నాగ్-చైతూ కాంబోలోనే ఎక్కువ సీన్లు ఉన్నాయట.