రణరంగం ఫస్ట్ వీక్ కలెక్షన్

శర్వానంద్ వరుసగా మరో ఫ్లాప్ కొట్టాడు. పడి పడి లేచే మనసు తర్వాత చాలా ఆశలతో చేసిన రణరంగం సినిమా అతడికి హిట్ అందించలేకపోయింది. నిన్నటితో వారం రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా వసూళ్ల పరంగా ఫ్లాప్ గా నిలిచింది. నిన్నటి వసూళ్లతో కలుపుకొని ఏపీ, నైజాంలో ఈ సినిమాకు 9 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అటు సినిమాను 17 కోట్ల రూపాయలకు అమ్మారు.

విడుదలైన మొదటి రోజు వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 4 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. ఆ మరుసటి రోజు నుంచే సినిమా వసూళ్ళు పడిపోయాయి. మరీ ముఖ్యంగా మంగళ, బుధవారాలు ఆక్యుపెన్సీ అస్సల్లేదు. అలా 9 కోట్ల రూపాయల వద్దే ఆగిపోయింది రణరంగం సినిమా. వచ్చే సోమవారం నుంచి ఈ సినిమాకు వసూళ్లు కష్టమే అంటోంది ట్రేడ్. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా డిజాస్టర్ అయింది.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కింది రణరంగం సినిమా. ఈ నిర్మాతలకు బయ్యర్లకు మంచి సంబంధాలున్నాయి. అందుకే నష్టపోయిన బయ్యర్లను ఆదుకునేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధంచేశారు ఈ నిర్మాతలు. కోల్పోయిన మొత్తంలో 50శాతాన్ని భర్తీచేయబోతున్నారు. గతంలో అజ్ఞాతవాసి సినిమాకు కూడా ఇలానే చేశారు వీళ్లు.