రెవెన్యూ శాఖకు…. భూదేవి పేరు

ఓ వైపు బీజేపీ దూసుకొస్తోంది. తెలంగాణలో హిందుత్వ ఎజెండాతో ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో దాన్ని అస్త్రంగా మలుచుకోవాలని కేసీఆర్ ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టులో వివిధ బ్యారేజీలు, పంప్ హౌస్ లకు ఆది దేవతలైన పార్వతి, సరస్వతి, లక్ష్మీ, అన్నపూర్ణ , శ్రీరాజరాజేశ్వరి లాంటి దేవతల పేర్లు పెట్టారు. ఇది బీజేపీని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగానే అని అందరూ అనుమానించారు.

తాజాగా మరో ఎత్తుగడ వేసి కేసీఆర్ ఆశ్చర్యపరిచారు. తెలంగాణలో అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేయాలని భావిస్తున్న కేసీఆర్ ఈ మేరకు రెవెన్యూశాఖనే ఎత్తివేసి అవినీతికి అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నాడు. అందులో భాగంగా పూర్వం బ్రిటీష్ కాలంలో పెట్టిన ‘రెవెన్యూ’ పేరు తొలగించాలని యోచిస్తున్నట్టు సమాచారం..

ప్రాజెక్టులకు దేవతల పేరు పెట్టినట్టే రెవెన్యూ శాఖకు వేరే పేరు పెట్టాలని భావిస్తున్నారట. రెవెన్యూ అంటే వసూళ్లు అని అర్థం.

ఇప్పుడు భూమిపై ఎలాంటి శిస్తులు, పన్నులు లేకపోవడంతో ఆ పదాన్ని తొలగించాలని యోచిస్తున్నట్టు సమాచారం.

తాజాగా జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో కేసీఆర్ రెవెన్యూశాఖ పేరును తొలగించి ‘భూదేవి’ అనే పేరును పెట్టాలని కలెక్టర్లతో తన అభిప్రాయం పంచుకున్నట్టు తెలిసింది.

రెవెన్యూ శాఖ మొత్తం ‘భూములకు’ సంబంధించి మాత్రమే ఉంటుంది కావడంతో ఈ పేరు బాగా సూట్ అవుతుందని ప్రతిపాదించారట..దీనికి కలెక్టర్లు కూడా ఓకే చెప్పడంతో త్వరలోనే రెవెన్యూశాఖ పోయి ‘భూదేవి’ అనే పేరు వస్తుందని సమాచారం.