వాహనదారులూ… గీత దాటారా…జేబు ఖాళీ..!

రెడ్ సిగ్నల్ ఉండగా అటు ఇటు దొంగ చూపులు చూస్తూ సిగ్నల్ దాటి వెళ్లిపోదామనుకుంటున్నారా….?

యూటర్న్ దూరంగా ఉందని దొంగ దారిలో వెళ్లిపోదామని ప్లాన్ వేస్తారా…?

మందు కొట్టి వాహనం నడిపితే ఏముందిలే వందో, వెయ్యో ఫైన్ కట్టేసి వెళ్లిపోదామనుకుంటున్నారా…?

ఇక ముందు ఇవన్నీ కుదరవు. రోడ్డు నిబంధనలను గాలికి వదిలేసి హాయిగా వెళ్లిపోదామనుకునే వారికి షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.

మోటారు వాహన నిబంధనల చట్టాన్ని మరింత కఠితరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నూతన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి సైతం ఆమోద ముద్ర వేసేశారు.

ఈ నిబంధనల మేరకు భవిష్యత్ లో ఎవరు ట్రాఫిక్ గీత దాటినా వారి నుంచి భారీ జరిమానా విధించనున్నారు. ఈ నిబంధనలను దశల వారీగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. నూతన వాహనాలు కొనుగోలు చేసిన వారు డీలర్ల వద్దే రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, ఆన్ లైన్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ జారీ వంటి నిబంధనలు ఇందులో పొందుపరిచారు.

అధిక బరువుతో వాహనాలను నడిపితే రెండు వేల రూపాయలు అపరాధ రుసుం విధిస్తున్నారు. అలాగే ప్రతి అదనపు టన్నుకు వెయ్యి రూపాయలు ఫైన్ వేసేవారు. ఇప్పుడు ఆ ఫైన్ ను ఏకంగా 20 వేల రూపాయలకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. అలాగే అదనపు బరువు టన్నుకు రెండు వేల రూపాయలకు పెంచారు.

హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన వారు ఇన్నాళ్లూ వంద రూపాయలు ఫైన్ కట్టేవారు. ఇప్పుడు దానిని వెయ్యి రూపాయలకు పెంచడమే కాకుండా మూడు నెలల పాటు బండి నడపకుండా అనర్హత వేటు వేస్తారు.

మద్యం మత్తులో వాహనం నడుపుతే రెండు వేల రూపాయలు ఉన్న అపరాధ రుసుం ఇప్పుడు పది వేల రూపాయలకు పెంచారు.

సీటు బెల్టు పెట్టుకోకపోతే వంద రూపాయలున్న ఫైన్ ఇక నుంచి వెయ్యి రూపాయలుగా పెంచారు.

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే 5 వేల రూపాయలు చెల్లించాల్సిందే. ఇంతకు ముందు ఈ ఫైన్ 500 రూపాయలు మాత్రమే.

అర్హత లేని వారు వాహనం నడిపితే 500 అపరాధ రుసుం ఉండేది. దానిని అక్షరాల 10000 వేల రూపాయలకు పెంచేశారు.

అధిక వేగంగా బండి నడిపే వారికైతే వీపు విమానం మోతే. వారికి విధించే అపరాధ రుసుం వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకూ ఉంటుంది.

అత్యవసర వాహనాలకు అంటే అంబులెన్స్ లకు దారి ఇవ్వకపోతే ఇప్పటివరకు పెద్దగా స్పందన ఉండేది కాదు. కాని ఇప్పుడు మాత్రం ఆ పని చేశారా… పది వేల రూపాయలు కట్టాల్సిందే.

వాహనానికి ఇన్సూరెన్స్ లేకపోతే రెండు వేలు చెల్లించాలి. ఈ అపరాధరుసుం ఇంతకు ముందు వెయ్యి రూపాయలు మాత్రమే ఉండేది.

ఇక పర్మిట్ లేని వాహనం అయితే ఏకంగా 10 వేల రూపాయలు అపరాధ రుసుం చెల్లించాలి. ఇంతకు ముందు ఇది ఐదు వేల రూపాయలుండేది.

ప్రయాణీకులూ… రోడ్డు మీదకు బండితో రావాలంటే నిబంధనలైనా పాటించండి… లేదూ జేబులో దండిగా డబ్బులైనా పెట్టుకోండి.