ఏం లెగ్‌ బాబు… పవార్‌తో కన్నీరు, చిద్దూకు జైలు

అమెరికాలో జ్యోతి ప్రజ్వలన చేయలేదు కాబట్టి జగన్‌ హిందూ వ్యతిరేకి అంటూ టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేసిన ట్వీట్‌కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.

కళ్లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎలక్ట్రానిక్ దీపాన్ని అగ్గిపెట్టతో సీఎం రమేష్ మాత్రమే వెలిగించగలడని ఎద్దేవా చేశారు.

అక్కడ పత్తి లేదు, నూనె లేదు, దీపమే లేదు… చూడడానికి సీఎం రమేష్‌కు కళ్లు లేవు అంటూ విమర్శించారు. రక్తంలో ఉన్న ఎల్లో వైరస్ ప్రభావం వల్లే సీఎం రమేష్ అలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.

40 గుళ్లని కూల్చడం, సదావర్తి భూములను స్వాహా చేయడం, వెంకన్న బంగారు కిరీటాలు ఎత్తుకుపోవడం, పుష్కరాల్లో వేల కోట్లు మింగి 29 మందిని చంపేడం అన్నది హిందుత్వాన్ని అవమానించడం అవుతుందన్నారు.

చంద్రబాబు లెగ్‌ పవర్‌ పైనా విజయసాయి రెడ్డి కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఎవరింట్లో పాదం మోపినా, కరచాలనం చేసినా ఆ వ్యక్తులు రాజకీయంగా పతనమై పోవడం అన్నది యాధృచ్చికం కాదని… అది ఆయన పాద మహిమ అని అభిప్రాయపడ్డారు.

ఇప్పుడు చిదంబరం పీకల్లోతు కష్టాల్లో ఉన్నారని… ఎమ్మెల్యేలు పార్టీ మారుతుంటే ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కన్నీరు పెట్టుకుంటున్నారని … ఆ దృశ్యాలు కూడా మీడియాలో వచ్చాయని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. ఇదంతా చంద్రబాబు పాద మహిమేనన్నారు.