ఆధునిక క్రికెట్ పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ

  • 2010-2019 మధ్యకాలంలో 20 వేల 502 పరుగులు
  • తొమ్మిదేళ్ల కాలంలోనే 20 వేల పరుగులు
  • చేజింగ్ లో 26 సెంచరీల మొనగాడు విరాట్
  • కెప్టెన్ గా 76 ఇన్నింగ్స్ లో 21 శతకాల కొహ్లీ
  • చేజింగ్ విజయాలలో 22 సెంచరీల విరాట్ కొహ్లీ
  • కెప్టెన్ గా విండీస్ పై 7 శతకాల విరాట్
  • వెస్టిండీస్ ప్రత్యర్థిగా 9 సెంచరీల విరాట్

అంతర్జాతీయ క్రికెట్లో భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ రికార్డులకు మరోపేరుగా నిలిచిపోయాడు. 2010 సీజన్లో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిననాటి నుంచి గత దశాబ్దకాలంగా కొహ్లీ నిలకడగా రాణిస్తూ నవతరం క్రికెట్ పరుగుల యంత్రంగా మారిపోయాడు.

మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న ఒక్కో ప్రపంచ రికార్డును అధిగమిస్తూ తన ప్రస్థానం కొనసాగిస్తున్నాడు. 11 ఏళ్ల తన కెరియర్ ను రికార్డుల మోతతో ముగించాడు.

విండీస్ తో ముగిసిన తీన్మార్ వన్డే సిరీస్ ఆఖరి రెండువన్డేలలో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాదడం ద్వారా మాస్టర్ సచిన్ 49 శతకాల ప్రపంచ రికార్డుకు ఆరు సెంచరీల దూరంలో నిలిచాడు.

పరుగుల యంత్రం…

2010 సీజన్లో భారత సీనియర్ జట్టులో సభ్యుడిగా అంతర్జాతీయ మ్యాచ్ ల అరంగేట్రం చేసిన విరాట్ కొహ్లీ..గత దశాబ్ద కాలంలో మరే సమకాలీన ఆటగాడు సాధించనన్ని పరుగులు సాధించి తనకుతానే సాటిగా నిలిచాడు.

క్రికెట్ చరిత్రలోనే.. మొత్తం మూడు ఫార్మాట్లలో కలిపి 20వేలకు పైగా పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

సాంప్రదాయ టెస్ట్, ఇన్ స్టంట్ వన్డే, ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లలో కలిపి గత పదేళ్ల కాలంలో కొహ్లీ మొత్తం 67 శతకాలతో సహా 20వేల 502 పరుగులు సాధించడం ద్వారా… భారత క్రికెట్ నయా రన్ మెషీన్ గా తన పేరును సార్థకం చేసుకొన్నాడు.

2000-2009 మధ్యకాలంలో రికీ పాంటింగ్ 55 సెంచరీలతో సహా 18 వేల 962 పరుగులు, జాక్ కలిస్ 38 శతకాలతో సహా 16 వేల 777 పరుగులు సాధించి…కొహ్లీ తర్వాతి స్థానంలో నిలిచారు.

మాస్టర్ సచిన్ టెండుల్కర్ 15 వేల 962 పరుగులతో ఆరోస్థానంలో నిలవడం విశేషం.

చేజింగ్ లో సెంచరీల కింగ్…

అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ల్లో చేజింగ్ సమయంలో బ్యాటింగ్ కు దిగిన జట్టుపైన, ఆటగాళ్లపైన చెప్పలేని ఒత్తిడి ఉంటుంది. అయితే …చేజింగ్ కు దిగిన సమయంలోనే అత్యుత్తమంగా రాణించడం, సెంచరీలు బాదడం విరాట్ కొహ్లీకి ఓ అలవాటుగా మారిపోయింది.

గత పదేళ్ల కాలంలో కొహ్లీ మొత్తం 26 చేజింగ్ సెంచరీలు సాధించాడు. ఇందులో భారత్ 22సార్లు విజేతగా నిలవడం విశేషం. అంటే కొహ్లీ జట్టుకు ముందుండి సెంచరీలు సాధించడం ద్వారా విజయాలు సాధించడంలో ప్రధానపాత్ర వహించాడు.

ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు…

వన్డే క్రికెట్లో విరాట్ కొహ్లీ గత 11 సంవత్సరాల కాలంలో మొత్తం ఎనిమిది ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు సాధించాడు. ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్ల వరుసలో నాలుగో స్థానంలో నిలిచాడు.

క్రికెట్ చరిత్రలోనే 14సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన అరుదైన ప్రపంచ రికార్డు మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతోనే ఉంది.

విండీస్ ప్రత్యర్థిగా 9 శతకాలు..

కరీబియన్ టీమ్ ప్రత్యర్థిగా తొమ్మిది సెంచరీలు బాదిన ఘనత విరాట్ కొహ్లీకి మాత్రమే ఉంది. ఇందులో కెప్టెన్ గా 7 శతకాలు సాధించడం విశేషం.

ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా మాస్టర్ సచిన్ టెండుల్కర్ 9 సెంచరీలు సాధిస్తే…విండీస్ పై విరాట్ కొహ్లీ 9 సెంచరీలు సాధించడం ఓ అరుదైన రికార్డుగా నిలిచిపోతుంది.

కెప్టెన్ గా అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన ఆటగాళ్ల వరుసలో విరాట్ కొహ్లీ రెండోస్థానంలో నిలిచాడు. ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 22 శతకాలతో అగ్రస్థానంలో నిలిస్తే… కొహ్లీ 21 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు.

కేవలం పదేళ్ల కాలంలోనే 67 అంతర్జాతీయ శతకాలు సాధించిన కొహ్లీ..వచ్చే దశాబ్దకాలంలో ఇదేజోరు కొనసాగించినా ఆశ్చర్యంలేదు.