మంత్రి బొత్సకు సీబీఐ కోర్టు నోటీసులు

రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం వదల్లేదు అన్నట్టుంది ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ పరిస్థితి. ఏపీలో అధికారంలోకి వచ్చి మంత్రిగా అధికారం అనుభవిస్తున్న బొత్స సత్యానారాయణకు పాత కేసు ఒకటి మళ్లీ తిరగదోడి మెడకు చుట్టుకోవడం సంచలనంగా మారింది.

తాజాగా వైఎస్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న సమయంలో నమోదైన ‘వోక్స్ వ్యాగన్’ కేసులో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు హైదరాబాద్ సీబీఐ కోర్టు సమన్లు జారీ చేయడం సంచలనంగా మారింది. వచ్చే 12న స్వయంగా హాజరు కావాలని అందులో పేర్కొనడంతో హాట్ టాపిక్ గా మారింది.

ఉమ్మడి ఏపీలో 2005లో వోక్స్ వ్యాగన్ కేసును సీబీఐ నమోదు చేసింది. ఈ కార్ల కంపెనీ ఏర్పాటులో అవినీతి చోటు చేసుకుందని ఆనాడు ఆరోపణలు రావడంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. అప్పుడు భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఈకేసులో 12 కోట్ల అవినీతి జరిగిందని సీబీఐ గుర్తించింది. 7 కోట్లు రికవరీ చేశారు. ఈ కేసు ఇప్పుడు ఈయన మెడకు చుట్టుకుంది.

సీబీఐ దీనిపై ఇప్పటికే చార్జీషీట్ దాఖలు చేసి సాక్షులను విచారించింది. బొత్స కూడా ఈ కేసులో ఉన్నందున 12న హాజరు కావాలని సీబీఐ తాఖీదులు పంపింది.ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టించింది.