వెళ్లి ఇంట్లో కూర్చోండి… లోకేష్‌పై సొంత నెటిజన్లు నిప్పులు

నారా లోకేష్‌ బయట మాట్లాడితేనే కాదు… ట్విట్టర్‌లో మాట్లాడినా అది ఎదురు తిరుగుతోంది. తాజాగా ప్రభాస్‌ నటించిన సాహో చిత్రానికి మద్దతుగా లోకేష్ చేసిన ట్వీట్‌పై టీడీపీలో దుమారం రేగుతోంది. టీడీపీ అభిమానులు లోకేష్‌ ట్వీట్‌కు పెద్దెత్తున నెగిటివ్‌గా స్పందిస్తున్నారు.

ఏపీ జగన్‌ నాయకత్వంలో ముందుకెళ్తోందని ఇటీవల ప్రభాస్‌ ప్రశంసించిన వెంటనే టీడీపీ శ్రేణులు పెద్దెత్తున సోషల్ మీడియాలో సాహోకు వ్యతిరేకంగా నెగిటివ్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు.

ఆ విషయాన్ని పలు వెబ్‌సైట్లు వెలుగులోకి తెచ్చాయి. దాంతో ఉలిక్కిపడ్డ నారా లోకేష్ ఎక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ తమకు వ్యతిరేకం అవుతారో అని వెంటనే ఆ ప్రచారాన్ని ఖండిస్తూ ట్వీట్ పెట్టారు. పనిలో పనిగా సాహోను హిట్‌ చేసేందుకు టీడీపీ వారు కూడా చూడాలని పిలుపునిచ్చారు. అయితే లోకేష్ పిలుపుకు టీడీపీ నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందన వచ్చింది.

ప్రభాస్‌ … జగన్‌ను పొగుడుతుంటే అతడికి మద్దతుగా ఎలా ట్వీట్ చేస్తారంటూ లోకేష్‌ను ప్రశ్నిస్తున్నారు. ప్రభాస్ బాబాయ్ కృష్ణంరాజు టీడీపీపై చేసిన ఆరోపణలు మరిచిపోయారా? అని నిలదీస్తున్నారు. టీడీపీ మూతపడబోతోందని, చంద్రబాబు ఒక చచ్చిన పాము అని కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను మరిచిపోయావా లోకేష్ అంటూ మండిపడుతున్నారు.

ఇంతకాలం చిత్రపరిశ్రమలో టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే భయపడిపోయే వారని… ఆ పరిస్థితి నుంచి సినిమా వాళ్లను చూసి టీడీపీనే భయపడుతోందన్న అభిప్రాయాన్ని లోకేష్ కలిగించారని టీడీపీ నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.

లోకేష్, బాలకృష్ణ రాజకీయాలకు పనికి రారని… వారిద్దరు ఇంట్లో కూర్చుంటే పార్టీకి మంచిదని రామకృష్ణ అనే టీడీపీ నెటిజన్ విరుచుకుపడ్డారు. చంద్రబాబును చచ్చిన పాము అని కృష్ణంరాజు అన్నప్పటికీ ప్రభాస్‌ సినిమాకు మద్దతుగా లోకేష్ ట్వీట్ చేయడం సిగ్గు చేటని సదరు నెటిజన్ రియాక్ట్ అయ్యారు. ఇదే తరహాలో లోకేష్‌ను విమర్శిస్తూ టీడీపీ వారి నుంచే భారీగా నెగిటివ్‌ కామెంట్స్ వస్తున్నాయి.