అతి మంచితనమే ఆ భర్త కొంప ముంచింది…!

భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తాయి..? కలసి బతకలేం.. మేం విడిపోతాం అని ఎప్పుడు అనుకుంటారు..? ఇవి కూడా ప్రశ్నలేనా.. భర్తో.. భార్యో గొడవలు పడి విడిపోతారు. ఇద్దరి మధ్య సఖ్యత లేక దూరమవుతారు.. అంతే కదా ప్రపంచంలో ఏ జంటకైనా జరిగేది అంటున్నారా..? అయితే మీకు ఈ విడాకుల స్టోరీ చెప్పాల్సిందే..!

యూఏఈ లోని షరియత్ కోర్టుకు ఒక విడాకుల కేసు వచ్చింది. అయితే ఆ కేసు వివరాలు చదివి ఏకంగా జడ్జే ఆశ్చర్యపోయాడు. తన భర్త అతి మంచితనం వల్ల నేను సరిగా కాపురం చేయలేకపోతున్నానని.. తనకు విడాకులు మంజూరు చేయాలని భార్య కోర్టులో కేసు వేసింది. తాను చెప్పిన పని, చెప్పని పని కూడా చేస్తూ విసుగు తెప్పిస్తున్నాడని భర్తపై ఆరోపణలు చేసింది.

కాగా, ఏమైనా గొడవలు ఉన్నాయా… అని జడ్జి ప్రశ్నించగా.. భార్య ఇలా జవాబిచ్చింది. మా మధ్య ఎలాంటి గొడవలు లేవని.. అతని ప్రేమను, మంచితనాన్ని తట్టుకోలేక పోతున్నానని తన పిటిషన్‌లో భార్య పేర్కొంది.

అసలు గొడవలు లేకుండా జీవించడం నాకు నరకంలా ఉందని… కనీసం సరదాకైనా గొడవ పడటం లేదని ఆమె చెప్పింది. వంట చేస్తాడని, అంట్లు కడుగుతాడని, బట్టలు కూడా తానే వాషింగ్ మెషిన్లో వేసి ఆరేస్తాడని.. తనకు అసలు పనే లేదని ఆమె వాపోయింది.

భార్య ఆరోపణలపై భర్తను ప్రశ్నించగా…. తనకు తన భార్యంటే చాలా ప్రేమని తనను కష్టపెట్టడం ఇష్టం ఉండదని బదులిచ్చాడు. తనతో నేను గొడవ పడలేనని అన్నాడు. గతంలో ఒక సారి తనను బరువు తగ్గమని చెప్పిందని.. వెంటనే కఠినమైన డైట్ ఫాలో అయి సన్నగా అయ్యానని అన్నాడు. భార్యతో గొడవపడటం తన వల్ల కాదని భర్త తేల్చి చెప్పాడు.

వీరిద్దరి వాదనలు విన్న జడ్జీ.. ఇది కోర్టులో విచారించదగిన కేసు కాదని.. మీరిద్దరూ కలసి కూర్చొని మాట్లాడుకొని మనస్పర్థలు తగ్గించుకోవాలని కోరారు. కేసును ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.