చంద్రబాబుకు అనిల్ వరద క్లాస్‌

తన ఇంటిని ముంచేందుకు ప్రభుత్వం వరదను సృష్టించిందంటూ చంద్రబాబునాయుడు పవర్ పాయిట్ ప్రజెంటేషన్ ఇవ్వడంపై మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్ స్పందించారు. చంద్రబాబు లేవనెత్తిన అంశాలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కౌంటర్ ఇచ్చారు.

చంద్రబాబు లేవనెత్తిన ప్రశ్నల ఆంతర్యం ఏమిటంటే… ప్రకాశం బ్యారేజ్ దిగువనున్న తన ఇంటిని ముంచే ఉద్దేశమే లేకుంటే… ఎగువ నుంచి వరద వస్తుంది అని తెలిసినప్పుడు ముందే రిజర్వాయర్లను ఖాళీ చేసి వచ్చే వరదతో మెల్లగా ప్రాజెక్టులను నింపుతూ ఉంటే ఇలా వరద హఠాత్తుగా తన ఇంటి వైపు వచ్చి ఉండేది కాదు అన్నది చంద్రబాబు అభిప్రాయం.

సముద్రంలోకి 300 టీఎంసీల నీరు వృథాగా వెళ్లినా సరే రాయలసీమకు సరిగా నీరు ఇవ్వలేకపోయారు అని అదే పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్‌లో చంద్రబాబు ఆరోపించారు.

చంద్రబాబు చెప్పినట్టు ఎగువ వరద వస్తుంది అని శ్రీశైలం నుంచి వచ్చిన నీటిని వచ్చినట్టు వదిలి ఉంటే ఈరోజు రాయలసీమకు చుక్క నీరు కూడా అంది ఉండేది కాదని అనిల్ కుమార్ చెప్పారు.

శ్రీశైలం నుంచి రాయలసీమకు నీరు అందాలంటే కనీసం 881 అడుగుల మేర నీటి నిల్వ ఉండాలి. ఆ స్థాయికి నీటి మట్టాన్ని చేర్చకుండా వచ్చిన నీరు వచ్చినట్టు వదిలి ఉంటే రాయలసీమకు నీరు ఎలా తీసుకెళ్లగలిగే వారని మంత్రి ప్రశ్నించారు.

రాయలసీమకు సరిగా నీరు ఇవ్వలేదని చంద్రబాబు ఆరోపిస్తూనే… మరోవైపు వరద నియంత్రణ కోసం శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో నీటి నిల్వకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎప్పటికప్పుడు నీటిని దిగువకు వదిలేయాల్సింది అని చంద్రబాబు సలహా ఇవ్వడం ఏమిటని అనిల్ ప్రశ్నించారు.

చంద్రబాబు తన చరిత్రలో ఎప్పుడైనా సరే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు పూర్తి స్థాయిలో నీరు ఇచ్చారా అని కూడా అనిల్ ప్రశ్నించారు. తాము చరిత్రలో తొలిసారి పోతిరెడ్డి పాడు ద్వారా 44వేల క్కూసెక్కుల గరిష్ట నీటి ప్రవాహాన్ని మళ్లించామని అనిల్ గుర్తు చేశారు.

ఒక నెలలోనే 60 టీఎంసీలకు పైగా నీటిని సీమకు అందించబోతున్నామని చెప్పారు. చంద్రబాబు చెప్పినట్టు ఆయన కరకట్ట ఇల్లు గురించి ఆలోచించి .. అనాలోచితంగా నీటికి ఎప్పటికప్పుడు వదిలేసి ఉంటే శ్రీశైలం ప్రాజెక్టులో ఇప్పుడు భారీగా నీటి కొరత ఉండేదని… రాయలసీమకు చుక్క నీరు కూడా వెళ్లి ఉండేది కాదన్నారు. ఈసారి శ్రీశైలం డ్యాంకు వచ్చిన వరద కూడా హఠాత్తుగా రెండు రోజుల్లోనే కనిష్టస్థాయికి పడిపోయిందని గుర్తు చేశారు.