మద్యం దుకాణాల అద్దె ఒక్క రూపాయి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మద్య పాన నిషేదానికి చేస్తున్న ప్రయత్నాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. రాష్ట్రంలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించింది.

రాష్ట్రంలో దశల వారీగా మద్యం దుకాణాల ఎత్తివేత చేపట్టేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్ది నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో బెల్టు షాపులను మూసి వేయించే పనిలో పడ్డారు ఎక్పైజ్ శాఖ అధికారులు.

మరోవైపు ఎక్పైజ్ శాఖ నూతనంగా ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ మద్యం దుకాణాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా దుకాణాల ఎంపికకు శ్రీకారం చుట్టారు. అయితే, మద్యం దుకాణాలకు తమ షాపులను అద్దెకు ఇచ్చేందుకు ప్రజలు స్వచ్చంధంగా ముందుకు వస్తున్నారు. అంతేనా… అద్దె కూడా కేవలం ఒక్క రూపాయి తీసుకుంటామని ముందుకు రావడం విశేషం.

శనివారం నాడు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాలకు షాపులను ఎంపిక చేసే ప్రక్రియను చేపట్టారు. ఏలూరు, పెదవేగి మండలాల్లో పలు చోట్ల ప్రభుత్వ మద్యం దుకాణాలకు తమ షాపులను అద్దెకు ఇచ్చేందుకు యజమానులు ముందుకు వచ్చారు. అది కూడా కేవలం ఒక్క రూపాయి మాత్రమే అద్దె చాలంటూ వారు ప్రకటించడంతో ఎక్సైజ్ శాఖ అధికారులకు నోట మాట రాలేదు.

ఏలూరు నగరంలోని 30వ డివిజన్ లో ఓ షాపు, పెదవేగి మండలంలో కూచింపూడి, కొప్పులవారిగూడెం, కొప్పాక గ్రామాలలో ఒక్క రూపాయికే మద్యం దుకాణాలు అద్దెకు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు యజమానులు.

“ఇదేమిటీ ఒక్క రూపాయికే దుకాణం అద్దెకిస్తున్నారు” అని ఎక్సైజ్ శాఖ అధికారులు అడిగిన ప్రశ్నకు దుకాణ యజమానుల నుంచి వచ్చిన సమాధానం “ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఓ మంచి కార్యక్రమం చేపట్టుతున్నారు. దానికి మేం కూడా ఇతోథికంగా సాయం చేస్తున్నాం” అని సమాధానం చెప్తున్నారు.

రూపాయికి దుకాణాలను అద్దెకు ఇవ్వడం ఒక ఎత్తు అయితే ప్రభుత్వానికి ఈ విధంగా సహకరించాలనుకోవడం మరో ఎత్తు అని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.

రూపాయికి మద్యం దుకాణాలను అద్దెకిస్తున్న వారికి, ఆ గ్రామాలకు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని, దీని వల్ల రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో కూడా దుకాణ యజమానుల నుంచి ఇలాంటి స్పందన వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు.