ఐదు కోట్ల హవాలా గుట్టు రట్టు

తాజాగా హైదరాబాద్ లో ఐదు కోట్ల రూపాయల హవాలా సొమ్మును స్వాధీనం చేసుకున్న పోలీసులు… ఈ హవాలా నేరంలో హైదరాబాద్ ప్రధాన పాత్ర పోషించడంతో కలవరపడుతున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైతో పాటు గుజరాత్ లోని సూరత్, అహ్మదాబాద్ నగరాల్లో జరుగుతున్న భారీ హవాలా రాకెట్ కు హైదరాబాద్ తో ఉన్నలింకులు వెలుగులోకి వస్తున్నాయి.

కోట్లాది రూపాయల డబ్బును కొన్ని గంటల వ్యవధిలోనే ఏ నగరంలో వారికైనా అందజేసే హవాలా ర్యాకెట్ ను నగర పోలీసులు ఛేదించారు. నగర పోలీసులు జరిపిన దాడుల్లో ఐదు కోట్ల రూపాయల హవాలా సొమ్ము పట్టుబడగా.. హవాలా రాకెట్ లో పాలుపంచుకున్న ఏడుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హవాలా కుంభకోణంలో పట్టుబడ్డ వారంతా గుజరాత్ కు చెందిన వారని తెలుస్తోంది.

ఈ గుట్టును రట్టు చేసిన పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేయడంతో పాటు వారి నుంచి ఐదు కోట్ల రూపాయల నగదు, రెండు కార్లు, ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. ముంబై, సూరత్, అహ్మదాబాద్ లను కేంద్రాలుగా చేసుకుని పీ. ఉమేష్ చంద్ర అండ్ కంపెనీ హవాలా రాకెట్ నిర్వహిస్తోందని పోలీసులు చెబుతున్నారు.

హైదరాబాద్ తో సహా దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలలో ఏజెంట్లను నియమించుకొని హవాలా రాకెట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గుజరాత్ లోని పఠాన్, మహేశాన జిల్లాలకు చెందిన పటేల్, శేషు బాయ్, విపుల్ కుమార్, ఉపేంద్ర కుమార్ పటేల్, అర్జున్ లాబూజీ, రాజేష్ రమేష్ భాయ్ లను హైదరాబాద్ లో తమ ఏజెంట్లుగా నియమించుకుని హవాలా దందాను కొనసాగిస్తున్నారు. ఈ ముఠా నూటికి 60 పైసలు కమిషన్ గా తీసుకొని డబ్బును ఎక్కడి వారికైనా చేరవేస్తారు. ఏ ప్రాంతంలో ఉన్న వారికి డబ్బు అందించాలన్నా హవాలా ముఠాకు గంట నుంచి గంటన్నర వరకు సమయం సరిపోతుంది.

ఈ నేపథ్యంలో ఐదు కోట్ల రూపాయలను ముంబాయ్ తరలించేందుకు ఏడుగురు నిందితులు రెండు కార్లు (టీఎస్09ఎఫ్ఎ-4948, టీఎస్09ఈఎక్స్6365), ఒక మోటార్ సైకిల్ (టీఎస్09 ఈజెడ్-9091) పై ముంబాయి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు వీరిని పట్టుకున్నారు. ఈ హవాలా దందా గురించి ముందే సమాచారం అందుకున్న నగర టాస్క్ ఫోర్స్ పోలీసులు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద మాటువేసి వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో ప్రధాన సూత్రధారి అయిన హర్షద్ భాయ్ పటేల్, ఉమేష్ ల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. హవాలా రాకెట్ లో అరెస్ట్ అయిన వారి నుంచి నగరంలో ఏజెంట్లు ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే ఆరా కూడా తీస్తున్నారు.