టెన్నిస్ శిఖరాన్ని ఢీ కొట్టిన భారత పసికూన

  • యూఎస్ ఓపెన్లో ఫెదరర్ పై సెట్ నెగ్గిన తొలి భారత ఆటగాడు
  • గాల్లో తేలిపోతున్న యువఆటగాడు సుమిత్ నగాల్

గ్రాండ్ స్లామ్ కింగ్, టెన్నిస్ మహాశిఖరం రోజర్ ఫెదరర్ తో…అదీ ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీలో తలపడే అవకాశం, అదృష్టం అతికొద్దిమంది ప్రత్యర్థులకు మాత్రమే దక్కుతుంది. అలాంటి అరుదైన అనుభవాన్ని భారత యువఆటగాడు సుమిత్ నగాల్ దక్కించుకొన్నాడు.

న్యూయార్క్ వేదికగా జరుగుతున్న 2019 యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ మెయిన్ డ్రాకు అర్హత సాధించడమే కాదు… తొలిరౌండ్లో దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెదరర్ తో తలపడే అవకాశం సొంతం చేసుకొన్నాడు. అదీ చాలదన్నట్లు…ఫెదరర్ పై తొలిసెట్ నెగ్గి సంచలనం సృష్టించాడు.

ఆర్థర్ ఏష్ స్టేడియం వేదికగా ముగిసిన తొలిరౌండ్ మ్యాచ్ లో 22 ఏళ్ల సుమిత్ నగాల్ 190 వ ర్యాంక్ ప్లేయర్ గా పోటీకి దిగాడు. ప్రపంచ మాజీ నంబర్ వన్ ఫెదరర్ పై తొలిసెట్ ను 6-4తో నెగ్గి తన జీవితాన్ని సార్థకం చేసుకొన్నాడు.

రెండున్నర గంటలపాటు సాగిన ఈ పోటీలో ఫెదరర్ చివరకు 4-6, 6-1, 6-2, 6-4 తో విజేతగా నిలవడం ద్వారా రెండోరౌండ్ కు చేరాడు. తొలిరౌండ్లో ఓడినా.. ఫెదరర్ లాంటి గొప్ప ఆటగాడితో తలపడి ఓ సెట్ నెగ్గడం తనకు విజయం లాంటిదేనని సుమిత్ నగాల్ పొంగిపోతున్నాడు. తనకు జీవితకాల అనుభవం అంటూ మురిసిపోతున్నాడు.