పడిలేచిన కెరటం అజింక్యా రహానే

  • విండీస్ తో తొలిటెస్టులో రహానే షో
  • విమర్శకులకు బ్యాటుతోనే బదులిచ్చిన వైస్ కెప్టెన్

టెస్ట్ క్రికెట్ ప్రపంచ నంబర్ వన్ జట్టు భారత్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే రెండేళ్ల విరామం తర్వాత సెంచరీ సాధించడం ద్వారా విమర్శకులకు తన బ్యాటుతోనే సమాధానం చెప్పాడు.

రెండుమ్యాచ్ ల ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్ లో భాగంగా ఆంటీగాలోని సర్ వీవ్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా ముగిసిన తొలి మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ లోనూ అజింక్యా రహానే తన బ్యాటుకు పూర్తిస్థాయిలో పని చెప్పి…మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు.

తొలి ఇన్నింగ్స్ లో 81, రెండో ఇన్నింగ్స్ లో 102 పరుగుల స్కోర్లు సాధించడం ద్వారా…రహానే మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొన్నాడు.

విదేశీగడ్డపై 7 సెంచరీల రహానే….

తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన టెస్టుల్లో మొత్తం 10 సెంచరీలు సాధించిన రహానే… విండీస్ ప్రత్యర్థిగా రెండు శతకాలు బాదాడు. రహానే సాధించిన మొత్తం 10 సెంచరీలలో ఏడు శతకాలు విదేశీ గడ్డపైనే సాధించడం విశేషం.

ఆస్ట్ర్రేలియా, ఇంగ్లండ్ టూర్లలో మాత్రమే కాదు…శ్రీలంకతో ముగిసిన స్వదేశీ టెస్ట్ సిరీస్ లో సైతం రహానే దారుణంగా విఫలం కావడం ద్వారా తీవ్రవిమర్శలు ఎదుర్కొన్నాడు.

చివరకు సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ లోని తుదిజట్టులో స్థానం సైతం కోల్పోయాడు. గత రెండు సంవత్సరాల కాలంలో మొత్తం 18 టెస్టులు, 29 ఇన్నింగ్స్ ఆడిన రహానే కేవలం ఆరు హాఫ్ సెంచరీలు మాత్రమే సాధించగలిగాడు. మూడంకెల స్కోరు సాధించడంలో దారుణంగా విఫలమయ్యాడు.

ఆ తర్వాత టీ-20, వన్డే జట్లలో సైతం రహానేకు అవకాశం లేకుండా పోయింది. అయినా…గత రెండు సంవత్సరాలుగా గడ్డు పరిస్థితి ఎదుర్కొన్న రహానే… కౌంటీ క్రికెట్లో ఆడటంతో పాటు ..డ్యూక్ బాల్స్ తో ఆడటం ద్వారా సాధన చేసి తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. తన సత్తా ఏపాటిదో చాటుకొన్నాడు.

ఫామ్ ఈజ్ టెంపరరీ…క్లాస్ ఈజ్ పెర్మనెంట్ అన్నమాట తనలాంటి ఆటగాళ్లకే వర్తిస్తుందని… రహానే చాటి చెప్పాడు.