Telugu Global
NEWS

మద్యంపై ఇక ఉక్కుపాదం

ఆంధ్రప్రదేశ్ లో మద్యపానంపై ప్రభుత్వం ఇక ఉక్కుపాదం మోపుతుందని, మద్యం స్మగ్లింగ్ కు చెక్ పెట్టాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వివిధ శాఖలకు సంబంధించిన ఆదాయ వ్యవహారాలపై బుధవారం నాడు రాజధానిలోని సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం జగన్. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ… మద్యం పై అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. మద్యం వల్ల వచ్చే అనర్దాలపై పాఠ్య పుస్తకాలలో పొందుపరచాలని, విద్యార్ధులకు చిన్నతనం నుంచే మద్యం వల్ల వచ్చే […]

మద్యంపై ఇక ఉక్కుపాదం
X

ఆంధ్రప్రదేశ్ లో మద్యపానంపై ప్రభుత్వం ఇక ఉక్కుపాదం మోపుతుందని, మద్యం స్మగ్లింగ్ కు చెక్ పెట్టాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

వివిధ శాఖలకు సంబంధించిన ఆదాయ వ్యవహారాలపై బుధవారం నాడు రాజధానిలోని సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం జగన్.

ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ… మద్యం పై అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. మద్యం వల్ల వచ్చే అనర్దాలపై పాఠ్య పుస్తకాలలో పొందుపరచాలని, విద్యార్ధులకు చిన్నతనం నుంచే మద్యం వల్ల వచ్చే విపరీత పరిణామాలను తెలియజేయాలని అధికారులకు సూచించారు.

మద్యపాన నియంత్రణ, నిషేధం అమలు కోసం ఎన్ ఫోర్స్ మెంట్, పోలీసు విభాగాలను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి.

మద్య నిషేధంపై గ్రామ సచివాలయ కార్యదర్శులు, మహిళా పోలీసులకు శిక్షణ ఇవ్వాలని…. ఇందుకోసం వారిని ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు.

“రాష్ట్ర్రంలో దశల వారీగా మద్య నిషేధం అమలు చేయాలనుకుంటున్నాం. ఇందుకోసం అధికార యంత్రాంగం అంతా నాతో కలిసి రావాలి” అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను కోరారు.

సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి రాష్ట్ర్రంలో 503 మద్యం దుకాణాలను ప్రభుత్వమే పైలెట్ ప్రాజెక్టుగా నిర్వహించనున్నదని, అక్టోబర్ 1 వ తేదీ నుంచి రాష్ట్రంలో 3500 మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

రాష్ట్రంలో బెల్టు దుకాణాలు తగ్గించడం వల్ల మద్యం వినియోగం గణనీయంగా తగ్గిందని, 2018-2019 సంవత్సరంలో 125 లక్షల కేసుల లిక్కర్ విక్రయాలు జరిగాయని, బెల్టు షాపుల నిలిపివేత కారణంగా ఈ ఏడాది జూలై నాటికి 12 లక్షల కేసుల మద్యం వినియోగం తగ్గిందని అధికారులు లెక్కలు చూపించారు.

రిజిస్ట్ర్రేషన్ కార్యాలయాల్లో దశాబ్దాల కాలంగా లంచగొండితనం పెరిగిపోయిందని, దానిని పూర్తిగా లేకుండా చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

“రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లంచాల వ్యవస్థ ఉండకూడదు. ఇందుకోసం అధ్యయనం చేయండి. మార్దదర్శక ప్రణాళికను రూపొందించండి” అని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

మరోవైపు జీఎస్టీ, వాహన రంగంలో వచ్చిన మార్పుల కారణంగా రాష్ట్రానికి ఆదాయం తగ్గిందని, వాణిజ్య పన్నుల్లో 14 శాతం వృద్ధి సాధించాల్సి ఉండగా 5.3 శాతం వృద్ధి తగ్గిందని అధికారులు చెప్పారు. ఈ సమావేశంలో పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో సహా మంత్రులు కూడా పాల్గొన్నారు.

First Published:  28 Aug 2019 11:52 PM GMT
Next Story