నిజామాబాద్ ఎంపీని ఎందుకు అవమానించినట్టు?

నిజామాబాద్ ఎంపీగా గెలిచిన అరవింద్ వ్యథ ఇది… తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అధినేతకే చుక్కలు చూపించి.. ఆయన ముద్దుల తనయ కవితను నిజామాబాద్ లో ఓడించిన ధర్మపురి అరవింద్ కు సొంత పార్టీ బీజేపీలోనే ఎదురైన అవమానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అందుకే ఇప్పటికీ అరవింద్.. హైదరాబాద్ లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి ఎక్కువగా రారని.. రాష్ట్ర బీజేపీ నేతలకు దూరంగా ఉంటారని పార్టీలో చర్చించుకుంటున్నారు. అరవింద్ ఇలా దూరంగా ఉండడానికి అసలు కారణం ఇదేనని తాజాగా కేంద్రంలోని పెద్దల చెవిలో ఈ విషయాన్ని వేసినట్టు సమాచారం.

నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ గెలవకముందు.. అంటే సరిగ్గా ఎంపీ ఎన్నికలకు ముందు హైదరాబాద్ లో బీజేపీ నాయకత్వం కీలక మీటింగ్ నిర్వహించింది. ఈ మీటింగ్ కు హాజరయ్యేందుకు లోపలికి వచ్చిన అరవింద్ ను గెట్ అవుట్ అని రాష్ట్ర పార్టీ కీలక నేత అవమానించారని టాక్. దీంతో తీవ్ర ఆవేదనతో అరవింద్ ఆ మీటింగ్ నుంచి వచ్చేశాడని.. ఇప్పటీకీ వారికి దూరంగా ఉంటున్నారని వినికిడి.

అయితే రాష్ట్ర బీజేపీ నేతల వ్యవహారశైలిపై తాజాగా కేంద్రంలోని పెద్దల దృష్టికి వచ్చిందట.. రాష్ట్రంలో మంచి నేతలు, యువతను ప్రోత్సహించడంలో పక్షపాతం చూపిస్తున్న రాష్ట్ర బీజేపీ నేతల తీరుపై ఓ కన్నేసి ఉంచారట. తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురునే ఓడించి బీజేపీ అగ్రనేతల వద్ద ఫేమస్ అయిన అరవింద్ ను ఇప్పుడు రాష్ట్రంలోని నేతలు పక్కనపెట్టడానికి కారణం ఏమిటన్న చర్చ ఆ పార్టీలో సాగుతోంది.