జాతీయ క్రీడా దినోత్సవం….ఓ మహా ప్రహసనం!

ఆగస్టు 29…భారత జాతీయ క్రీడాదినోత్సవం. హాకీమాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజును జాతీయ క్రీడాదినోత్సవంగా జరుపుకొంటూ రావడం ఆనవాయితీగా వస్తోంది. అయితే…72 సంవత్సరాల స్వతంత్ర భారత్ లో ఇప్పటికీ జాతీయ క్రీడాదినోత్సవం ప్రాధాన్యం ఏమిటో ….అసలు ఏ రోజున జరుపుకొంటారో తెలియని నవయువ జనాభా చాలామంది ఉన్నారంటే ఆశ్చర్యపోవడం మనవంతే అవుతుంది….

ఏమున్నది గర్వకారణం….

ప్రపంచ జనాభాలో భారత్ స్థానం రెండు. అత్యధిక యువజన జనాభా ఉన్న దేశాలలో భారత్ దే అగ్రస్థానం. అయితే ..క్రీడారంగంలో మాత్రం మన పరిస్థితి మిగిలిన దేశాలతో పోల్చిచూస్తే దిగదుడుపే.

రియో ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ స్థానం 57 మాత్రమే. అంతేకాదు…2014 ఆసియా క్రీడలు, 2018 కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో సైతం చిన్నదేశాల ముందు మన స్థానం దిగదుడుపే. క్రీడారంగంలో భారత్ ఈ వెనుకబాటు తనానికి అసలు కారణం ఏంటో చూస్తే విస్తుపోవడం మనవంతే అవుతుంది…..

ఎక్కడవేసిన గొంగళి అక్కడే…

72 సంవత్సరాల స్వతంత్ర భారత్…శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఎంతో ప్రగతి సాధించిన దేశం. అంతేకాదు అతిపెద్ద ఆర్ధికవ్యవస్థల్లో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న దేశం. ప్రపంచంలోని విఖ్యాత బహుళజాతి కంపెనీల చూపంతా ఇప్పుడు భారత్ మార్కెట్ వైపే. అయితే.. ఇదంతా నాణేనానికి ఓవైపు మాత్రమే.

క్రీడాపరంగా భారత్ ప్రగతి చూస్తే…ఎక్కడవేసిన గొంగళి అక్కడే అని చెప్పక తప్పదు. మన పొరుగుదేశం చైనాతో పోల్చిచూస్తే…ఒలింపిక్స్ లో భారత్ పరిస్థితి తీసికట్టే. జనాభాలో ప్రపంచంలోనే చైనా అతిపెద్ద దేశం.

దేశజనాభాకు తగ్గట్టుగానే క్రీడారంగంలో చైనా కళ్లు చెదిరే ప్రగతి సాధించింది. అమెరికా లాంటి సూపర్ పవర్ కే సవాలు విసిరే పరిస్థితికి ఎదిగింది. అదే…జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్…రియో ఒలింపిక్స్ పతకాల పట్టిక 57వ స్థానంలో ఉందంటే….మన పరిస్థితి ఎంత దయనీయమో మరి చెప్పాల్సిన పనిలేదు.

అత్యధిక యువజన జనాభా

ప్రపంచంలోని 204 దేశాలలో అత్యధిక యువజన జనాభా ఉన్న దేశం భారత్. దేశజనాభాలో 60 శాతం మంది యువజనులే. అయినా క్రీడలంటే ఏమాత్రం ఆసక్తిలేదు. వాలంటైన్స్ డే, మైకేల్ జాక్సన్ ల పుట్టిన రోజుల గురించి ఉన్న అవగాహన..జాతీయ క్రీడాదినోత్సవం గురించి లేకపోవడం చేదు నిజం.

వివిధ క్రీడలకు చెందిన మొత్తం 25 మంది అర్జున అవార్డీల బృందంతో ఇటీవలే నిర్వహించిన ఓ సదస్సులో…..భారత క్రీడారంగం వెనుకబాటుకు గల కారణాలు బయటకు వచ్చాయి. విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.

125 కోట్ల భారత జనాభాలో కేవలం 5.2 శాతం మందికి మాత్రమే క్రీడల గురించి కనీస అవగాహన ఉన్నట్లుగా ఇటీవలే నిర్వహించిన తాజా సర్వే ద్వారా తేలింది. జనాభాలో సగభాగం ఉన్న మహిళల్లో కేవలం 1.31 శాతం మందికి మాత్రమే క్రీడల గురించి అవగాహన ఉందంటే ముక్కుమీద వేలేసుకోవాల్సిందే.

అంతేకాదు…దేశజనాభాలో 3.27 శాతం మంది మాత్రమే…క్రీడల గురించి తెలుసుకోడానికి ఆసక్తిచూపుతున్నట్లు పరిశీలనలో వెల్లడయ్యింది.

క్రీడలు…. ఓ లాభసాటి వ్యాపారం…

క్రీడలంటే ఒకప్పుడు మానసిక ఉల్లాసం కోసం ఆడే ఆటలు మాత్రమే. అయితే ..ప్రపంచీకరణ పుణ్యమా అంటూ …క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్, కబడ్డీ లాంటి టీవీ ఫ్రెండ్లీ ఆటలతో…క్రీడారంగం కూడా బహుళజాతి సంస్థల వ్యాపారవాహకంగా మారిపోయింది.

క్రికెట్ అంటే ఇప్పుడు పరుగులు, వికెట్లు, క్యాచ్ లు, రికార్డులు ఏమాత్రం కాదు. ప్రసారహక్కులు, కిట్ బ్యాగులు, లోగో హక్కులు, ఇన్ స్టేడియా హక్కులు, జట్టు, క్రీడాకారుల వ్యక్తిగత ఎండార్స్ మెంట్లు… ఇలా ఏది చూసినా కోట్ల రూపాయల వ్యాపారమే.

టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా, బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు….ఆటతో కోట్ల కోటలు దాటినవారే. బహళజాతి సంస్థల అండదండలు, మీడియా ఫ్రెండ్లీగా ఉండే…క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్ లాంటి ఒకటి రెండు క్రీడల దెబ్బకు…మిగిలిన క్రీడలన్నీ విలవిలలాడిపోతున్నాయి. ప్రభుత్వాలు సైతం తమకు ఆదాయం, ప్రచారం తెచ్చిపెట్టే క్రీడల్ని, క్రీడాకారులను మాత్రమే ప్రోత్సహిస్తూ…మిగిలిన క్రీడలను, క్రీడాకారులను చిన్నచూపు చూస్తున్నాయి.

కనుమరుగైపోతున్న జాతీయస్థాయి పోటీలు

దేశంలో క్రీడలు ఎన్నిరకాలు ఉన్నా..సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ స్థాయిలో జాతీయ పోటీలు నిర్వహించడం ఓసాంప్రదాయంగా ఉండేది. ఈ పోటీల నిర్వహణ కోసం జాతీయ ఒలింపిక్ సంఘం, కేంద్రక్రీడామంత్రిత్వశాఖలు సహాయ సహకారాలు అందచేస్తూ ఉండేవి.

అయితే…లాభసాటి లీగ్ వ్యాపారం భారత క్రీడారంగంలోకి చొరబడటంతో….జాతీయపోటీల నిర్వహణ తూతూమంత్రంగా మారిపోయాయి. భారత క్రీడారంగ మూలాలే బలహీనపడే ప్రమాదం పొంచి ఉంది.

దీనికితోడు….క్రీడలు ఉమ్మడి జాబితా అంశం కావడంతో…. ఓ స్పష్టమైన క్రీడావిధానం అంటూ లేకపోడం భారత క్రీడారంగాన్ని కుదేలయ్యేలా చేస్తోంది. అదీచాలదన్నట్లుగా…ఏడాది నుంచి ఎనిమిదేళ్ల పిల్లలను క్రీడల పట్ల ఆకర్షించేలా చేయడంలో మన ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని, ఎలాంటి విధానాలు లేవని మాజీ క్రీడాదిగ్గజాలు అంటున్నారు.

దశాబ్దాలనాటి క్రీడామౌలిక సదుపాయాలతో భారత క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో ఏవిధంగా రాణించగలరని భారత హాకీ మాజీ కెప్టెన్, అర్జున అవార్డు గ్రహీత ఎం.పీ.గణేశ్ ప్రశ్నిస్తున్నారు.

మైదానాలు లేని పాఠశాలలు….

పాఠశాల అంటే సువిశాలమైన క్రీడా మైదానం, తరగతి గదులు అన్నమాట….నేటి తరం పాఠశాలలకు ఏమాత్రం వర్తించదు. చిన్నచిన్న నగరాలు, పట్టణాలలో సింగిల్ బెడ్ రూమ్ పాఠశాలలు, డబుల్, ట్రిపుల్ బెడ్ రూం కళాశాలలను చూస్తుంటే క్రీడారంగంలో భారత్ ఏగతిన బాగుపడుతుందన్న సందేహం రాకమానదు.

దేశంలోని క్రీడారంగ అభివృద్ధి కోసం కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు నిపుణుల సంఘాలలో సభ్యుడిగా ఉన్న భారత హాకీ మాజీ కెప్టెన్ జాఫర్ ఇక్బాల్ సైతం…ఆటలంటే ఏమిటో తెలియని నేటితరం బాలలు, పాఠశాలలు, కళాశాలలను చూసి తీవ్రఆందోళన చెందుతున్నారు.

కనీస క్రీడాసౌకర్యాలు లేని పాఠశాలల్లో చదివే నేటితరం బాలలకు ఆటలు ఆడే కనీస సదుపాయాలు లేకపోవడాన్ని మించిన విషాదం మరొకటి లేదని భారత మాజీ క్రీడాదిగ్గజాలు, అర్జున అవార్డీలు వాపోతున్నారు.

క్రీడలను సైతం నిర్భంద పాఠ్యాంశంగా ఎందుకు చేయరని ప్రశ్నిస్తున్నారు. మన సమాజం, ప్రభుత్వాలు, క్రీడావ్యవస్థ ఆలోచనా ధోరణిలో మార్పురానంత వరకూ భారత వెనుకబాటుతనం కొనసాగుతూనే ఉంటుందని నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ సంస్కృతి, స్మార్ట్ ఫోన్ విష కౌగిలి, పశ్చిమదేశాల అనుకరణలో ముందున్న మనదేశంలో……కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చొరవచూపకుంటే…..క్రీడాసంస్కృతి ఎండమామిగానే మిగిలిపోతుంది.

నిధుల కేటాయింపు అంతంతే…!

కేంద్రంలోను, తెలుగు రాష్ట్రాలలోనూ వార్షిక బడ్జెట్ల సమర్పణ తంతు చూస్తే మన ప్రభుత్వాలకు క్రీడలంటే ఎంత నిర్లక్ష్యమో అర్థమవుతుంది. బడ్జెట్ కేటాయింపుల్లో ఎప్పటిలానే క్రీడారంగానికి అరకొర మొత్తాలను మాత్రమే ఆర్థికమంత్రులు విదిలించి…క్రీడలకు తాము ఇస్తున్న ప్రాధాన్యం ఏపాటిదో చెప్పకనే చెప్పారు…. ప్రపంచంలోనే జనాభాపరంగా రెండో అతిపెద్ద దేశం భారత్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వస్తూ పోతూ ఉన్నా….క్రీడారంగానికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా అరకొర కేటాయింపులతో, విదిలింపులతోనే సరిపెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదు…నిధులు మిక్కుటంగా ఉన్న తెలంగాణా, నిధులో రామచంద్రా అంటూ కేంద్రప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ తమతమ ప్రాధమ్యాలకు
అనుగుణంగా కేటాయింపులు చేసి చేతులు దులుపుకొన్నాయి.

యథా కేంద్రం…. తథా తెలుగు రాష్ట్రాలు

భారత ప్రభుత్వం 2016 – 17 సంవత్సరానికి రూపొందించిన కేంద్ర బడ్జెట్ ను… 21 లక్షల 47వేల కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టారు. దేశంలోని 29 రాష్ట్రాలు, పలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన దాదాపు 125 కోట్ల జనాభా అవసరాలకు తగ్గట్టుగా మాత్రం క్రీడారంగానికి నిధులు కేటాయించలేకపోయారు.

సన్నాహాలు, శిక్షణ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని 350 కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా పెంచారు.

ఖేలో ఇండియా కార్యక్రమానికి గత బడ్జెట్ కంటే ప్రస్తుత బడ్జెట్లో 140 కోట్ల రూపాయలు పెంచారు. ఇక దేశంలో ప్రతిభావంతులైన క్రీడాకారుల అన్వేషణ కార్యక్రమం కోసం కేవలం 50 లక్షల రూపాయలు మాత్రమే కేటాయించారంటే ఆశ్చర్యపోవాల్సిందే.

మొత్తం 21 లక్షల 47వేల కోట్ల రూపాయల బడ్జెట్లో క్రీడారంగానికి 1943 కోట్లు మాత్రమే కేటాయించడం చూస్తే…క్రీడారంగానికి మనం ఇస్తున్న ప్రాధాన్యం ఏపాటిదో అర్థమవుతుంది.

తెలంగాణాలో అలా…

భారత దేశంలోని అత్యంత ధనిక రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణా 2016 -17 ఆర్థిక సంవత్సరానికి లక్షా 49వేల 646 కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెడితే….క్రీడారంగానికి కేటాయించింది కేవలం 37 కోట్ల రూపాయలు మాత్రమే.

ఇందులో… తెలంగాణా క్రీడాప్రాధికార సంస్థ నిర్వహణ, దాని అనుబంధ సంస్థల ఉద్యోగుల జీతభత్యాలకే సింహభాగం ఖర్చయిపోతుంది. అదిపోను మిగిలిన భాగం నుంచే క్రీడాకారులకు ప్రోత్సాహకాలు, ఇతర క్రీడాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది.

క్రీడామైదానాల ఆధునీకరణకు 10 కోట్ల రూపాయలు, క్రీడాకారులకు ఇచ్చే నగదు ప్రోత్సాహకాలకు 9 కోట్ల రూపాయలు , తెలంగాణా స్పోర్ట్స్ అథారటీ నిర్వహణకు 18 కోట్ల రూపాయలు కేటాయించారు..

తెలుగు రాష్ట్ర్రాలలోనూ అదే సీన్…

రియో ఒలింపిక్స్ పతకాల పట్టిక 57వ స్థానంలో భారత్ నిలిస్తే…. కేరళలో ముగిసిన 35వ జాతీయ క్రీడల పతకాల పట్టిక 12వ స్థానంలో తెలంగాణా, 18వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిలవడం అందరికీ తెలిసిందే. కంటితుడుపు కేటాయింపులతో క్రీడారంగంలో అత్యుత్తమ ఫలితాలతో పాటు…పతకాలపంట పండించడం అసాధ్యమని ప్రభుత్వాలు, అధినేతలు ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.

ఏ క్రీడలు చూసినా…?

ఈ భూఖండంలోనే జనాభాపరంగా రెండో అతిపెద్ద దేశం, ప్రపంచ యువజన జనాభాలో అగ్రస్థానంలో ఉన్న భారత్….. క్రీడారంగంలో మాత్రం ఆశించినస్థాయిలో ప్రగతి సాధించలేకపోయింది.

ఎన్నో రంగాలలో కళ్లు చెదిరే ప్రగతి సాధించిన భారత్ …..క్రీడారంగంలో మాత్రం అట్టడుగుస్థాయిలోనే కొట్టిమిట్టాడుతోంది. నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్స్, ప్రపంచ నంబర్ వన్ గేమ్ ఫుట్ బాల్ లో భారత పరిస్థితి దయనీయంగా తయారయ్యింది.

ఒలింపిక్స్ లో 204 దేశాలు పోటీపడుతుంటే…పతకాల పట్టికలో భారత్ స్థానం 57 మాత్రమే. అంతేకాదు…ప్రపంచ ఫుట్ బాల్ లో మన ర్యాంకు 101గా ఉందంటే…మన పరిస్థితి ఏంటో అర్థమవుతుంది.

చివరకు 77 దేశాల కామన్వెల్త్ గేమ్స్, 45 దేశాల ఆసియాక్రీడల్లో సైతం…..భారత పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. జాతీయ క్రీడ హాకీలో సైతం భారత మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. క్రికెట్, బ్యాడ్మింటన్, బిలియర్డ్స్ లాంటి ఒకటి రెండు క్రీడల్లో భారతజట్టు, క్రీడాకారులు రాణిస్తున్నా అది నామమాత్రమే.

1756 కోట్ల తంత్రం….

మనదేశంలో ప్రభుత్వాలు వస్తూ పోతూ ఉన్నా క్రీడారంగ పరిస్థితి మాత్రం రెండడుగులు ముందుకు నాలుగడుగులు వెనక్కు అన్నట్లుగా తయారయ్యింది. ఈ పరిస్థితిని అధిగమించడానికి గత ప్రభుత్వాలు అనుసరించిన వ్యూహాలు, పథకాలను సమగ్రంగా సమీక్షించిన ప్రధాని నరేంద్ర మోదీ….ఖేలో ఇండియా అనే వినూత్న కార్యక్రమానికి అంకురార్పణ చేశారు.

గతంలో ఉన్న రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్, పట్టణ ప్రాంతాలలో మౌలిక క్రీడాసదుపాయల కల్పన పథకం, క్రీడారంగంలో జాతీయ ప్రతిభాన్వేషణ పథకాలను మిళితం చేయడం ద్వారా ఖేలో ఇండియా కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ పథకం అమలు కోసం 1756 కోట్ల రూపాయలతో ప్రత్యేక బడ్జెట్ ను ఏర్పాటు చేశారు.

ఖేలో ఇండియా కార్యక్రమాన్ని గత కేంద్ర క్రీడామంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ రెండేళ్ల క్రితం అధికారికంగా ప్రారంభించారు. క్రీడారంగంలో అత్యంత ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారి చదువుకు ఆటంకం కలగని విధంగా క్రీడల్లో ప్రపంచ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇవ్వటానికి….దేశంలోని 20 విశ్వవిద్యాలయాలను ఎంపిక చేశారు.

దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులకు ఈ 20 విశ్వవిద్యాలయ కేంద్రాలు… స్పోర్టింగ్ ఎక్స్ లెన్స్ వేదికలుగా అందుబాటులో ఉంటాయి.

మూడంచెల విధానం….

అధునాతన శిక్షణ సదుపాయాలతో పాటు….అత్యాధునిక రీతిలో తీర్చి దిద్దే శిక్షకులు సైతం ఈ కేంద్రాలలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అట్టడుగుస్థాయి నుంచే ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి…. శిక్షణతో పాటు విద్యా సదుపాయాలను సైతం అందిస్తారు.

దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు, వ్యవస్థలు….స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్ కేంద్రాలతో అనుసంధానమై ఉంటాయి. అంతేకాదు…వివిధ క్రీడలకు సంబంధించిన తాజా సమాచారం తెలుసుకోడానికి వీలుగా ప్రత్యేక యాప్ లను సైతం సిద్ధం చేస్తున్నట్లు కేంద్రక్రీడామంత్రి ప్రకటించారు.

ఎంపిక చేసిన విశ్వవిద్యాలయాలలోని క్రీడామైదానాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం, అత్యాధునిక శిక్షణ సౌకర్యాలు అందుబాటులో ఉంచడం, క్రీడాశిక్షకుల పరిజ్ఞానాన్ని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరచడం…ఖేలో ఇండియాకు ఆయువుపట్టుగా ఉంటాయి.

పదేళ్ల నుంచి 18 సంవత్సరాల వయసున్న ప్రతిభావంతులైన బాలలు,యువతీయువకులను గుర్తించి….ఎంపిక చేసిన క్రీడలతో పాటు చదువులోనూ రాటుదేలేలా చేయటమే ఖేలో ఇండియా ప్రధానలక్ష్యంగా ఉంది.

క్రీడావిధానం పైనా పునరాలోచన…..

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే మన రాజ్యాంగంలో….క్రీడలు ఉమ్మడి జాబితా అంశంగా ఉండటం కూడా దేశక్రీడాభివృద్ధికి ప్రతిబంధకంగా తయారయ్యింది.

కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తానికీ ఓ క్రీడావిధానాన్ని రూపొందిస్తే…..రాష్ట్రాలస్థాయిలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే ప్రత్యేక క్రీడావిధానం ఏర్పాటు చేసుకోడం క్రీడాప్రగతిలో అసమానతలకు తావిస్తోంది. ఈ పరిస్థితిని నివారించి… దేశమంతటికీ  ఓ సమగ్రక్రీడావిధానం సిద్ధం చేయటానికి రాష్ట్రప్రభుత్వాల సహకారం తీసుకొంటామని క్రీడామంత్రి కిరణ్ రిజ్జూ అంటున్నారు.

క్రీడల్ని ప్రస్తుత ఉమ్మడి జాబితా నుంచి కేంద్ర జాబితా అంశంగా మార్చే ఆలోచన కూడా ఉందని ప్రకటించారు. అయితే ఇదంతా దశలవారీగా జరుగుతుందని చెబుతున్నారు.

ఏదిఏమైనా….జనజీవితంలో క్రీడాసంస్కృతి ఓ ప్రధాన భాగంకానంత వరకూ…..జాతీయ గీతం, జాతీయ పతాకంతో సమానంగా జాతీయ క్రీడాదినోత్సవానికి ప్రాధాన్యం ఇవ్వనంత వరకూ…..భారత క్రీడారంగ ప్రగతి ఓ అందమైన కలగానే ఉండిపోతుంది.