ఈసారి దిల్ రాజు ఏం చేస్తాడో..!

నైజాంలో బిగ్ ప్లేయర్ దిల్ రాజు. భారీ సినిమాలు రిలీజ్ చేయాలంటే ఇతడు రంగంలోకి దిగాల్సిందే. నైజంలో దిల్ రాజు నియంతృత్వం ఎక్కువైందనే వాళ్లు కూడా ఉన్నారు. వాదనలు, సమర్థనలు ఎన్ని ఉన్నప్పటికీ దిల్ రాజు మాత్రం డిస్ట్రిబ్యూషన్ లో దూసుకుపోతూనే ఉన్నాడు. అలాంటిదే ఓ కీలకమైన పంపిణీ బాధ్యత దిల్ రాజుపై పడింది.

అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురం సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ ను దిల్ రాజు తీసుకున్నాడు. నైజాంలో పాటు ఉత్తరాంధ్ర ఏరియా రైట్స్ కూడా ఇతడే దక్కించుకున్నాడు. మరోవైపు మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాను కూడా దిల్ రాజే నైజాంలో రిలీజ్ చేస్తున్నాడు. అయితే సరిగ్గా ఇక్కడే చిక్కొచ్చి పడింది.

అల వైకుంఠపురం, సరిలేరు నీకెవ్వరు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ రెండు సినిమాల్లో దేనికి దిల్ రాజు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడనేది ఆసక్తికరంగా మారింది. మహేష్ సినిమాకు ఎక్కువ థియేటర్లు ఇస్తే బన్నీ ఫ్యాన్స్ కు కోపం. అలాగని బన్నీ ఫ్యాన్స్ కోసం థియేటర్లు పెంచితే మహేష్ ఫ్యాన్స్ ఊరుకోరు. దీన్ని దిల్ రాజు ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.

నిజానికి దిల్ రాజుకు ఇలా రెండు భారీ సినిమాల్ని ఒకేసారి విడుదల చేయడం కొత్తేంకాదు. ఈ ఏడాది సంక్రాంతికి కూడా దిల్ రాజు ఇదే పనిచేశాడు. గతంలో శతమానంభవతి రిలీజ్ టైమ్ లో కూడా దిల్ రాజు థియేటర్ల కేటాయింపుల్లో చాకచక్యంగానే వ్యవహరించాడు. సో.. ఈసారి మహేష్, బన్నీ ఫ్యాన్స్ ను తృప్తిపరిచేలా దిల్ రాజు వ్యవహరిస్తాడని అంతా భావిస్తున్నారు.