జమైకాటెస్ట్ తొలిరోజున హోరాహోరీ

  • కొహ్లీ, మయాంక్ ఫైటింగ్ హాఫ్ సెంచరీలు
  • భారత్ 5 వికెట్ల నష్టానికి 264 పరుగులు

ఐసీసీటెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా విండీస్ తో జరుగుతున్న రెండుమ్యాచ్ ల సిరీస్ లోని ఆఖరి టెస్ట్ తొలిరోజుఆట హోరాహోరీగా ముగిసింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 90 ఓవర్లలో 5 వికెట్లకు 264 పరుగులతో భారీస్కోరుకు పునాది వేసుకొంది.
యువఆటగాళ్లు హనుమ విహారీ, రిషభ్ పంత్ 6వ వికెట్ కు 62 పరుగుల అజేయ భాగస్వామ్యంతో క్రీజులో ఉన్నారు.

ఫాస్ట్ అండ్ బౌన్సీ పిచ్ పైన పోరు…

ఆంటీగా వేదికగా ముగిసిన తొలిటెస్టులో 318 పరుగుల భారీపరాజయం చవిచూసిన ఆతిథ్య విండీస్ జట్టు..రెండోటెస్ట్ ను నెగ్గితీరాలన్న లక్ష్యంతో.. ఇద్దరు ఆటగాళ్లకు టెస్ట్ క్యాప్ లు ఇచ్చింది.

ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ రకీం కార్న్ వాల్, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జహ్ మార్ హామిల్టన్ ఈ మ్యాచ్ ద్వారా టెస్ట్ అరంగేట్రం చేశారు. విండీస్ కెప్టెన్ హోల్డర్ టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకోడంతో…ఫాస్ట్ -బౌన్సీ పిచ్ పైన భారత్ ముందుగా బ్యాటింగ్ కు దిగాల్సి వచ్చింది.

ఓపెనర్లు రాహుల్, మయాంక్ అగర్వాల్ మొదటి వికెట్ కు 32 పరుగులు చేర్చిన తర్వాత…విండీస్ తొలివికెట్ పడగొట్టగలిగింది. రాహుల్ 13 పరుగులకు అవుట్ కాగా…వన్ డౌన్ చతేశ్వర్ పూజారా 6 పరుగులకే వెనుదిరిగాడు.

కొహ్లీ 22వ హాఫ్ సెంచరీ…

46 పరుగులకే రెండు టాపార్డర్ వికెట్లు నష్టపోయిన భారత్ ను ఆదుకొనే భారం కెప్టెన్ కొహ్లీ, ఓపెనర్ మయాంక్ లపైన పడింది. మూడో వికెట్ కు ఈ ఇద్దరూ హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో పరిస్థితి చక్కదిద్దారు.

అగర్వాల్ 127 బాల్స్ లో 7 బౌండ్రీలతో 55 పరుగులు సాధించడం ద్వారా తన టెస్ట్ కెరియర్ లో మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

మరోవైపు కెప్టెన్ విరాట్ కొహ్లీ బాధ్యతాయుతంగా ఆడి 163 బాల్స్ లో 10 బౌండ్రీలతో 76 పరుగులు సాధించడం ద్వారా… టెస్ట్ క్రికెట్లో 22వ హాఫ్ సెంచరీ పూర్తి చేసి…విండీస్ కెప్టెన్ హోల్డర్ బౌలింగ్ లో అవుటయ్యాడు.

మిడిలార్డర్ జోడీ హనుమ విహారీ, రిషభ్ పంత్ 6వ వికెట్ కు 62 పరుగుల అజేయభాగస్వామ్యంతో జట్టును ఆదుకోగలిగారు.

విహారీ 80 బాల్స్ లో 8 బౌండ్రీలతో 42, పంత్ 64 బాల్స్ లో 2 బౌండ్రీలు, 1 సిక్సర్ తో 27 పరుగులు సాధించడంతో… తొలిరోజు ఆట ముగిసింది.

విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ 20 ఓవర్లలో 39 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. రోచ్, రకీం చెరో వికెట్ సాధించారు. బ్యాటింగ్ కు అంతగా అనువుకాని సబైనాపార్క్ పిచ్ పైన భారత్ 5 వికెట్లు మాత్రమే నష్టపోయి 264 పరుగులు సాధించడం ద్వారా మ్యాచ్ పైన పట్టుబిగించినట్లే కనిపిస్తోంది.