టెస్ట్ చరిత్రలో అత్యంత బరువైన ఆటగాడిగా రకీం

  • భారత్ ప్రత్యర్థిగా జమైకాలో టెస్ట్ అరంగేట్రం
  • కంగారూ క్రికెటర్ ను అధిగమించిన రకీం

కరీబియన్ స్పిన్ ఆల్ రౌండర్ రకీం కార్న్ వాల్ అత్యంత బరువైన టెస్ట్ క్రికెటర్ గా రికార్డుల్లో చోటు సంపాదించాడు.

13 దశాబ్దాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆస్ట్ర్రేలియాకు చెందిన వార్విక్ ఆర్మ్ స్ట్ర్రాంగ్ పేరుతో ఉన్న 139 కిలోల రికార్డును 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు కలిగిన రకీం 140 కిలోల బరువుతో అధిగమించాడు.

కరీబియన్ దేశవాళీ క్రికెట్లో నంబర్ వన్ ఆఫ్ స్పిన్నర్ గా పేరున్న రకీం 260 వికెట్లు సాధించడంతో పాటు నిలకడగా రాణించడం ద్వారా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

చివరకు…కింగ్స్ టన్ సబైనాపార్క్ వేదికగా భారత్ తో మొదలైన రెండోటెస్ట్ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశాడు. అంతేకాదు…తన అరంగేట్రం టెస్ట్ లోనే బౌలింగ్ కు దిగిన రకీం తన మూడోఓవర్ లోనే భారత వన్ డౌన్ ఆటగాడు చతేశ్వర్ పూజారాను పెవీలియన్ దారి పట్టించాడు.

రకీం తొలిరోజు ఆటలో మొత్తం 27 ఓవర్లు బౌల్ చేసి 8 మేడిన్ ఓవర్లతో 69 పరుగులిచ్చి ఒక వికెట్ సాధించాడు.

ఐదురోజుల సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ ఆడాలంటే మితిమీరిన బరువు ఏమాత్రం అవరోధం కాదని.. రెండు క్యాచ్ లు పట్టడం ద్వారా రకీం నిరూపించాడు.

లోయర్ ఆర్డర్ లో వీరబాదుడు బ్యాట్స్ మన్ గా కూడా రకీం కార్న్ వాల్ కు గుర్తింపు ఉంది.