యూనియన్ బ్యాంక్ లో ఆంధ్రాబ్యాంక్ విలీనం

తెలుగు వారు మనదీ అని పిలుచుకునే ఒకే ఒక్క బ్యాంకును కేంద్రం మరో బ్యాంకులో విలీనం చేసేసింది. మొన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ను మరో బ్యాంకులో విలీనం చేసిన కేంద్రం నిన్న మనకు మిగిలిన ఏకైక బ్యాంక్ ఆంధ్రాబ్యాంకును యూనియన్ బ్యాంక్ లో విలీనం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

సరిగ్గా 96 ఏళ్ల క్రితం స్వాతంత్ర్య సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య ప్రారంభించిన ఆంధ్రాబ్యాంక్ ఇప్పుడు చరిత్ర పుటల్లో కలిసిపోతోంది. తెలుగు వారి బ్యాంకు ఆంధ్రాబ్యాంకును తెలుగు వారి కోడలు, కేంద్ర ఆర్థిక మంత్రి పరకాల నిర్మలా సీతారామన్ ఇంకో బ్యాంకులో విలీనం చేయడం మరో విషాదం.

దేశంలో తొలిసారిగా 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను ఇతర బ్యాంకులలో విలీనం చేసింది కే్ంద్రం. ఈ విలీనం కారణంగా దేశంలో ఇప్పుడు జాతీయ బ్యాంకుల సంఖ్య 12కు తగ్గింది. ఇంతకు ముందు దేశంలో జాతీయ బ్యాంకులు 27 ఉండేవి.

ఈ విలీన ప్రక్రియను దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ దీనిని ఆపేది లేదంటూ ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చేశారు. దేశంలో భారీ రుణాలిచ్చే బ్యాంకులే ఉండాలనే ఏకైక లక్ష్యంతో ఈ విలీన ప్రక్రియను చేపట్టినట్లు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

విలీనం అనంతరం బ్యాంకు బ్యాలెన్స్ షీట్లను సరి చేయడం కోసం 52 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.

దేశంలో ఒకేసారి నాలుగు విలీనాలు చేపట్టింది కేంద్రం. దీంతో ఇంతవరకూ ఉన్న 10 ప్రభుత్వ రంగ బ్యాంకులు నాలుగు బ్యాంకింగ్ దిగ్గజాలుగా అవతరించాయి. ఈ విలీనం అనంతరం జాతీయ బ్యాంకుల సంఖ్య 12కు తగ్గనుంది. ఈ విలీనం కారణంగా జాతీయ బ్యాంకులు బలోపేతం కావడంతో పాటు ఆయా బ్యాంకుల రుణ వితరణ కూడా భారీగా పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది.

ఆంధ్రాబ్యాంకుతో పాటు కార్పొరేషన్ బ్యాంకును కూడా యూనియన్ బ్యాంకులో విలీనం చేసిన కేంద్రం…. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను పంజాబ్ నేషనల్ బ్యాంకుతో విలీనం చేసింది. అలహాబాద్ బ్యాంకును ఇండియన్ బ్యాంకుతోను, సిండికేట్ బ్యాంకును కెనరా బ్యాంకుతోను విలీనం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఈ బ్యాంకుల విలీనం ద్వారా బ్యాంకుల ఆర్థిక పరిపుష్టి బాగుంటుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీని కారణంగా ఈ ఏడాది మార్చి 31 నాటికి ప్రభుత్వ బ్యాంకులకు రావాల్సిన మొండి బకాయిలు రూ. 7.9 లక్షల కోట్లకు తగ్గాయని మంత్రి తెలిపారు.

మరోవైపు బ్యాంకుల విలీనం కారణంగా ఉద్యోగులెవరూ తమ ఉద్యోగాలను కోల్పోరని ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు.

గతంలో బీఓబీలో విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను విలీనం చేసినప్పుడు ఏ ఒక్క ఉద్యోగం పోలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. బ్యాంకుల విలీన ప్రక్రియను కాంగ్రెస్ తో సహా ప్రతిపక్షాలన్నీ తీవ్రంగా ఖండించాయి.