టెస్ట్ క్రికెట్ 150 వికెట్ల క్లబ్ లో మహ్మద్ షమీ

  • జమైకాటెస్ట్ 3వ రోజున షమీ 150వ వికెట్
  • 42 టెస్టుల్లో 150 వికెట్ల షమీ

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ…టెస్ట్ క్రికెట్ 150 వికెట్ల క్లబ్ లో చోటు సంపాదించాడు. ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా జమైకా వేదికగా విండీస్ తో జరుగుతున్నరెండోటెస్ట్ మ్యాచ్ మూడోరోజు ఆటలో షమీ ఈ ఘనత సంపాదించాడు.

కరీబియన్ లోయర్ ఆర్డర్ ఆటగాడు రకీబ్ కార్న్ వాల్ ను 14 పరుగుల స్కోరుకే పెవీలియన్ దారి పట్టించడం ద్వారా షమీ 150వ వికెట్ సాధించాడు. షమీ కేవలం 42 టెస్టుల్లోనే 150 వికెట్లు పడగొట్టడం విశేషం.

టెస్టు క్రికెట్లో 150 వికెట్లు పడగొట్టిన భారత ఇతర ఫాస్ట్ బౌలర్లలో కపిల్ దేవ్, జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్, ఇశాంత్ శర్మ సైతం ఉన్నారు.

కపిల్ ఫాస్టెస్ట్ రికార్డు…

భారత టెస్ట్ చరిత్రలో అతితక్కువ టెస్టుల్లో 150 వికెట్లు సాధించిన రికార్డు హర్యానా హరికేన్ కపిల్ దేవ్ కు ఉంది. కపిల్ కేవలం 39 టెస్టుల్లోనే ఈ రికార్డు సాధించగా.. జవగళ్ శ్రీనాథ్ 40టెస్టులు, జహీర్ ఖాన్ 49 టెస్టులు, ఇశాంత్ శర్మ 54టెస్టుల్లో 150 వికెట్ల మైలురాయిని చేరగలిగారు.