యూఎస్ ఓపెన్ క్వార్టర్స్ లో జోకోవిచ్ రిటైర్డ్ హర్ట్

  • టైటిల్ వేటను అర్థంతరంగా ముగించిన నంబర్ వన్
  • భుజం నొప్పితో ఆట నుంచి తప్పుకొన్న టాప్ సీడ్

2019 యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జోకోవిచ్ పోటీ క్వార్టర్ ఫైనల్స్ దశలోనే అర్థంతరంగా ముగిసింది.

న్యూయార్క్ ఆర్థర్ ఏష్ స్టేడియం వేదికగా స్విస్ ఆటగాడు స్టాన్ వావరింకాతో జరిగిన పోటీలో 4-6, 5-7, 1-2తో జోకోవిచ్ వెనుకబడిన సమయంలో.. ఆట నుంచి ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించాడు. భుజం నొప్పితో ఆటలో కొనసాగలేనని చైర్ అంపైర్ కు తెలిపాడు.

గత ఐదు గ్రాండ్ స్లామ్ టోర్నీలలో నాలుగు టైటిల్స్ నెగ్గిన ప్రపంచ నెంబర్ వన్ జోకోవిచ్..ప్రీ-క్వార్టర్స్ ఆడుతున్న సమయంలోనే భుజం నొప్పి ప్రారంభమయ్యింది.

నొప్పితోనే ఆటను కొనసాగించి మ్యాచ్ నెగ్గిన జోకోవిచ్.. క్వార్టర్స్ లో మాత్రం చేతులెత్తేయక తప్పలేదు.

సెమీఫైనల్లో చోటు కోసం జరిగే పోటీలో రష్యా ఆటగాడు, 5వ సీడ్ మెద్వదేవ్ తో వావరింకా తలపడతాడు. క్వార్టర్ ఫైనల్స్ లోనే జోకోవిచ్ పోటీ ముగియడంతో.. ప్రపంచ మాజీ నంబర్ వన్ రోజర్ ఫెదరర్ 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించడానికి మార్గం సుగమమైనట్లయ్యింది.

3వ సీడ్ ఫెదరర్ కు ఐదుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన రికార్డు ఉంది.