2024లో పొత్తు పక్కా..!

2014లో ఏపీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ జట్టు కట్టాయి. వారికి జనసేన పార్టీ అధినేత బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత పలుమార్లు అధికార పార్టీకి మద్దతు ఇస్తూ… ప్రభుత్వం వైఫల్యాలను కూడా ప్రతిపక్షంపై నెట్టేస్తూ పలు విమర్శలు కూడా చేశారు. రాజకీయంగా ఎన్ని విమర్శలు ఎదురైనా పవన్ కళ్యాణ్ తన వైఖరి మార్చుకోలేదు.

ఇక 2019 ఎన్నికల్లో వైసీపీని ఓడించడానికి టీడీపీ, జనసేన తమ శాయశక్తులా కృషి చేశాయంటారు రాజకీయ విశ్లేషకులు. బయటకు పొత్తు లేకున్నా.. లోపాయికారంగా మాత్రం పవన్ టీడీపీకి సహాయం చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. లోకేష్ పోటీ చేసిన మంగళగిరిలో జనసేన అభ్యర్థిని నిలబెట్టకపోవడం.. పలు చోట్ల టీడీపీకి పోటీగా బలహీనమైన అభ్యర్థిని నిలపడం వంటివి చేశాయి.

తాజాగా టీడీపీ, జనసేన దోస్తీ ఎంత బలంగా ఉందో చెప్పడానికి మరో సాక్ష్యం లభించింది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నిన్న నర్సీపట్నంలో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. ఈ సారి సార్వత్రిక ఎన్నికలు ముందుగానే వస్తాయని.. మోడీ కూడా జమిలీ ఎన్నికలు జరపాలనే ఆలోచనలో ఉన్నారని.. టీడీపీ దీనికి సహకరిస్తుందని తేల్చి చెప్పారు.

అంటే ఈ మూడు పార్టీలు ఇంకా టచ్‌లోనే ఉన్నాయని.. రాబోయే భవిష్యత్ కార్యాచరణను కలిసే రూపొందిస్తాయనే విధంగా మాట్లాడటంతో అసలు విషయం బయటపడింది. ఇక రాబోయే రోజుల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఈ మూడు పార్టీలు కలిసి పని చేస్తాయని తెలుస్తోంది.